ఇన్స్టాగ్రాంలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ.. ముగ్గురు యువతులను చంపిన డ్రగ్ స్మగ్లర్లు

ఇన్స్టాగ్రాంలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ..  ముగ్గురు యువతులను చంపిన డ్రగ్ స్మగ్లర్లు
  • గోళ్లు పీకి, వేళ్లు కత్తిరించి నరకం చూపిన దుండగులు
  • అర్జెంటీనాలో దారుణం
  • ఐదుగురు అనుమానితులు అదుపులోకి
  • దోషులను శిక్షించాలని వేల మంది నిరసన

బ్యునోస్ ఐర్స్: అర్జెంటీనాలో దారుణం జరిగింది. గ్యాంగ్  కోడ్  ఉల్లంఘించారంటూ  ముగ్గురు యువతులను డ్రగ్‌‌‌‌  స్మగ్లర్లు అతి దారుణంగా చంపారు. గోళ్లు పీకి, వేళ్లు కత్తిరించి నరకం చూపారు. చివరికి శ్వాస ఆడకుండా చేసి హత్య చేశారు. ఇన్ స్టాగ్రాంలో లైవ్ స్ట్రీమింగ్  చేస్తూ ఈ హత్యలు చేశారు. ఈ నెల 19న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులను మోరెనా వెర్డీ (20), బ్రెండా డెల్  కాస్టిల్లో (20), లారా గుటిర్రెజ్ (15) గా గుర్తించారు. 

అర్జెంటీనా రాజధాని బ్యునోస్ ఐర్స్ లో ఒక ఇంటి ఆవరణలో ఆ యువతుల డెడ్ బాడీలను ఈ నెల 24న కనుగొన్నారు. ఐదు రోజుల ముందు వారి ఆచూకీ తెలియకుండా పోయింది. పక్కా ప్లాన్  వేసి దుండగులు వారిని చంపారు. 

పార్టీకి వెళ్తున్నామని నమ్మిస్తూ డ్రగ్స్  గ్యాంగ్  దుండగులు వారిని ఈ నెల 19న వ్యాన్ లో ఎక్కించుకుని కిడ్నాప్  చేశారు. యువతులను గుర్తుతెలియని చోటికి తీసుకెళ్లారు. డ్రగ్స్  దందాకు సంబంధించిన సమాచారాన్ని లీక్  చేస్తున్నారని, అంతేకాకుండా డ్రగ్స్  దొంగిలిస్తున్నారని వారిని చిత్రహింసలకు గురిచేశారు. గోళ్లు పీకి, వేళ్లు కత్తిరించారు. ఊపిరాడకుండా చేసి చంపేశారు. గ్యాంగ్  కోడ్ ను ఉల్లంఘించిన ఎవరికైనా ఇదే గతి పడుతుందని ఆ వీడియోలో హెచ్చరించారు. 

ఆ రక్తపిపాసులను కఠినంగా శిక్షించాలి

యువతుల హత్యలను ఖండిస్తూ రాజధాని బ్యునోస్ ఎయిర్స్​లో శనివారం కొన్నివేల మంది పౌరులు నిరసన ప్రదర్శన చేపట్టారు. మృతుల బంధువులకు సంఘీభావం తెలిపారు. బ్రెండా డెల్ క్యాస్టిల్లో తండ్రి లియోనల్  డెల్  క్యాస్టిల్లో మీడియాతో మాట్లాడుతూ.. తన కూతురి మృతదేహంపై తీవ్రంగా గాయాలు ఉన్నందువల్ల బాడీని తాను గుర్తుపట్టలేదన్నారు. బాధితులను గ్యాంగ్ చిత్రహింసలు పెట్టిందని, ఆ రక్తపిపాసులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్  చేశారు. ప్రజలు తమకు అండగా ఉండాలని కోరారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఐదో అనుమానితుడు లాజిస్టిక్స్  సమకూర్చాడని తెలిపారు. హత్యల సూత్రధారి ఫొటోను అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.