యూనిఫాం​ సివిల్​ కోడ్​ బిల్లుపై రాజ్యసభలో రగడ

యూనిఫాం​ సివిల్​ కోడ్​ బిల్లుపై రాజ్యసభలో రగడ
  • ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీ కిరోడీలాల్ మీనా
  • వెనక్కి తీసుకోవాలంటూ సభలో ప్రతిపక్షాల నిరసన

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యూనిఫాం ​సివిల్​ కోడ్​ అమలుకు సంబంధించిన బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. ఈ ప్రైవేట్​ మెంబర్​ బిల్లును రాజస్థాన్​కు చెందిన బీజేపీ ఎంపీ కిరోడీలాల్​ మీనా శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తృణముల్​ కాంగ్రెస్​ ఎంపీలు ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. ఇది దేశ సమగ్రతను, భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశాయి. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో బిల్లును సభ్యుల అభిప్రాయం తీసుకునేందుకు రాజ్యసభ చైర్మన్​ జగదీప్​ ధన్​కర్​ ఓటింగ్​ నిర్వహించగా.. అనుకూలంగా 
63 ఓట్లు, వ్యతిరేకంగా 23 ఓట్లు పడ్డాయి. 

గవర్నర్ల అధికారాలపై.. 

గవర్నర్ల అధికారాలు, పాత్రను నిర్వచిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలంటూ సీపీఎం ఎంపీ కె.శివదాసన్ ప్రైవేట్​ మెంబర్​ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో గవర్నర్ కు, ప్రభుత్వానికి మధ్య వివాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఆయన ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 
నేషనల్​ జ్యుడీషియల్​ కమిషన్​ బిల్లు కూడా..
నేషనల్​ జ్యుడీషియల్​ కమిషన్​ ద్వారా జడ్జీల నియామకాలను రెగ్యులేట్​ చేసేందుకు ఉద్దేశించిన ప్రైవేట్​ మెంబర్​ బిల్లును సీపీఎం ఎంపీ బికాస్​ రంజన్​ భట్టాచార్య రాజ్యసభలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో సభ్యులు ఆమోదం తెలపడంతో ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. అయితే 
ఈ బిల్లును ఆప్​ వ్యతిరేకించింది.

వ్యాక్సిన్​ వేస్ట్​ కాలేదు: కేంద్రం

ఎక్స్​పైరీ వల్ల కరోనా వ్యాక్సిన్​ దేశంలో ఎక్కడా వృథా కాలేదని కేంద్రం లోక్ సభకు తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్​ పవార్​ రాతపూర్వకంగా సభకు వివరించారు. వ్యాక్సిన్ వివరాలపై ఎప్పటికప్పుడు కేంద్రం మానిటర్​ చేస్తోందని, ఎక్కువ వినియోగం, తక్కువ వృథా అన్న విధానంతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. వ్యాక్సిన్​ వినియోగంపై ఎప్పటికప్పుడు రివ్యూలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించినట్టు వెల్లడించారు. అలాగే ద కాన్​స్టిట్యూషన్​(షెడ్యూల్​ ట్రైబ్స్) ఆర్డర్(ఫిఫ్త్ అమెండ్​మెంట్) బిల్లు, 2022ను కేంద్ర ప్రభుత్వం లోక్​సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి అర్జున్​ ముండా ఈ బిల్లులను సభ ముందు ప్రవేశపెట్టారు.