70ఏళ్ల వయస్సులో  చేతులు కట్టుకుని ఈత కొట్టింది

70ఏళ్ల వయస్సులో  చేతులు కట్టుకుని ఈత కొట్టింది

ఈ రోజుల్లో 40 లేదా 50 సంవత్సరాలు దాటగానే చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు, గుండె సంబంధిత వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరి 60 ఏళ్లు దాటిన వాళ్లు ఏదైనా సాహసాలు చేయగలుగుతారా..? కేరళలో 70 ఏళ్ల ఓ మహిళ స్విమ్మింగ్ లో సాహసాలు చేస్తూ అందరిచే ఔరా అనిపించుకుంటున్నారు.

2018లో వచ్చిన వరదలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఈ సమయంలో చాలామంది వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కొంతమంది ఈత రాకపోవడం వల్ల కూడా చనిపోయారు. ఇది గమనించిన అలువాలోని తైక్కట్టుకరకు చెందిన ఆరిఫా అనే 70 ఏళ్ల మహిళ స్విమ్మింగ్‌ నేర్చుకోవడం చాలా అవసరమని భావించారు. ఈ క్రమంలో తన మనవరాలిని స్థానికంగా ఉండే సాజీ అనే కోచ్ దగ్గర చేర్పించారు. కోచ్ సాజి వలస్సేరి గత 12 ఏళ్లుగా వందల మందికిపైగా స్విమ్మింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇచ్చాడు. ఇందులో సీనియర్‌ సిటిజెన్స్‌తో పాటు వికలాంగులు కూడా ఉన్నారు.

పట్టుదలతో శ్రమించి
ఒకరోజు ఆరిఫా తన మనవరాలు ఈత కొట్టడం చూడాలని స్విమ్మింగ్ అకాడమీకి వెళ్లారు. మనవరాలి స్విమ్మింగ్ చూసి తను కూడా నేర్చుకోవాలని అనుకున్నారు. ఇదే విషయం గురించి కోచ్ సాజి వలస్సేరిని అడిగారు. ఆయన కూడా ప్రయత్నం చేయండని చెప్పడంతో 68 ఏళ్ల వయస్సులో స్విమ్మింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. ఈత నేర్చుకున్న ఏడాదిలోనే పెరియార్ నదిలో 500 మీటర్ల వరకు ఈత కొట్టి.. అందరిచే ఔరా అనిపించారు. అంతేకాదు.. ఇటీవలే నిర్వహించిన ఓ కార్యక్రమంలోనూ ఆరిఫా.. కున్నుంపురానికి చెందిన 11 ఏళ్ల భరత్ కృష్ణ, అశోకపురానికి చెందిన 38 ఏళ్ల ధన్య కేజీతో కలిసి మడపం కడవు నుంచి మణప్పురం దేసోం కడవు వరకు చేతులు కట్టేసుకుని స్విమ్మింగ్ చేశారు. అలా కోచ్‌ పర్యవేక్షణలో 45 నిమిషాల్లోనే దాదాపు 780 మీటర్ల వరకు ఈత కొట్టి శభాష్ అనిపించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నిపుణులైన గజ ఈతగాళ్ల పర్యవేక్షణలో  నిర్వహించారు. ‘ఎవరైనా సరే ఈత నేర్చుకోవడానికి వయస్సు అడ్డంకి కాదు’ అనే  సందేశాన్ని అందరికీ తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని స్విమ్మింగ్ నిర్వాహకులు తెలియజేశారు. 

మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలుతారని గర్వంగా చెబుతున్నారు ఆరిఫా. లక్ష్యంగా పెట్టుకుని శ్రమిస్తే తప్పుకుండా ఫలితం ఉంటుందంటున్నారు. ప్రతి ఒక్కరూ ఈత నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని, అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. 70 ఏళ్ల వయస్సులోనూ స్విమ్మింగ్‌ ఏం నేర్చుకుంటామని అనుకునే వాళ్లకు ఆరిఫా ఇప్పుడు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.  

ఉచితంగా శిక్షణ
వలస్సేరి రివర్ స్విమ్మింగ్ క్లబ్‌ను 2010లో అలువాకు చెందిన సాజి వలస్సేరి (కోచ్ ) ప్రారంభించారు. ఇప్పటి వరకూ సాజీ 5,700 మందికి పైగా ఉచితంగా స్విమ్మింగ్ లో శిక్షణ ఇచ్చాడు. వారిలో 700 మంది వికలాంగులు, సీనియర్ సిటిజన్లు కూడా ఉన్నారు. ఈ సంవత్సరం వేసవి సెలవుల్లో 720 మందికి ఈత నేర్పించారు. వీరిలో 130 మంది పెరియార్ నదిని దాటగలిగారు. అన్ని వయసుల వారిని ఈత నేర్చుకునేలా ఇక్కడి వలస్సేరి రివర్ స్విమ్మింగ్ క్లబ్ ప్రోత్సహిస్తుండడం విశేషం.