జమ్మూ కాశ్మీర్‌లో లాండ్‎మైన్ బ్లాస్ట్.. ఒక భారత జవాన్ మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

జమ్మూ కాశ్మీర్‌లో లాండ్‎మైన్ బ్లాస్ట్.. ఒక భారత జవాన్ మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది.‎ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ల్యాండ్‎మైన్ పేలింది. మందు పాతర పేలుడు ధాటికి ఒక భారత జవాన్ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అధికారుల వివరాల ప్రకారం.. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి ప్రాంతంలో శుక్రవారం (జూలై 24) రోజు మాదిరిగానే సైనికులు కుంబింగ్ నిర్వహించారు. 

ఈ క్రమంలోనే ఎప్పుడో అమర్చిన ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అయ్యింది. పేలుడి తీవ్రతకు7 JAT రెజిమెంట్‌కు చెందిన అగ్నివీర్ జవాన్ లలిత్ కుమార్‌ ప్రాణాలు కోల్పోగా జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO)తో సహా మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం వారి హెల్త్ కండిషన్ నిలకడగానే ఉందని వెల్లడించారు. 

కాగా, జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ల్యాండ్‌మైన్ పేలుళ్లు కొత్తేమీ కాదు. 2025, మే నెలలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూంచ్ జిల్లాలోని ఎల్‌ఓసీ వెంబడి ల్యాండ్ మైన్ పేలి ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. దిగ్వార్ సెక్టార్‌లోని ఫార్వర్డ్ ప్రాంతంలో సైనికులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.