ఆరోగ్యశ్రీకి కరెంటు కష్టాలు

ఆరోగ్యశ్రీకి కరెంటు కష్టాలు
  •  ఆరు రోజులుగా నిలిచిపోయిన అప్రూవల్స్
  • రోగుల అవస్థలు

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రంలో ఎక్కడ ఏ ఆపరేషన్​ జరగాలన్నా ఆన్​లైన్​లో అనుమతిచ్చే కేంద్రమది.. ఎంతో కీలకమైన ఆ విభాగానికి వారం రోజులుగా కరెంటు లేదు. భారీ వర్షాలకు ట్రాన్స్​ఫార్మర్​లో సమస్య తలెత్తింది. కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఏడు రోజులు గడిచినా సరఫరా పునరుద్ధరించలేదు. దీంతో అప్రూవల్స్​ పెండింగ్​లో పడి రాష్ట్రవ్యాప్తంగా పలు ఆపరేషన్లకోసం ఎదురుచూస్తున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనరేటర్​ సాయంతో రోజూ కొన్ని గంటల పాటు అప్రూవల్స్ ఇచ్చారు. శని, ఆదివారాల్లో కరెంట్ లేక ఒక్క ఆపరేషన్ కూడా అప్రూవల్​ఇవ్వలేదు. దీంతో డయాలసిస్, కీమోథెరపీకి సంబంధించి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా పది సైకిళ్లకు ఒకసారి డయాలసిస్ కు అప్రూవల్ ఇస్తారు. తర్వాత మరోసారి అనుమతివస్తే గానీ డయాలసిస్ చేయరు. కరెంట్ లేక అప్రూవల్ రాకపోవటంతో ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో డయాలసిస్ పేషెంట్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. రోగి అవస్థ చూడలేక అప్రూవల్ లేకపోయినప్పటికీ అతనికి డయాలసిస్ నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 500 నుంచి 700 వరకు అప్రూవల్స్ పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.  సోమవారం జనరేటర్ సహాయంతో ఆన్ లైన్ లో కొన్ని ఆపరేషన్స్ కు అనుమతులిచ్చారు. ఓ ప్రభుత్వ విభాగాన్ని నిర్వహించే భవనానికి వారం రోజులుగా కరెంట్ లేకపోయిన అధికారులు పట్టించుకోకపోవటంపై విమర్శలు వస్తున్నాయి.

104 సేవల విభాగానికి ఫోన్ ఆపరేటర్లు

ఆరోగ్యశ్రీ స్కీం కింద ఎమర్జెన్సీ ఆపరేషన్లు నిర్వహించాల్సి వస్తే ఫోన్​ ద్వారా అప్రూవల్ మంజూరుచేస్తారు. అయితే, కరెంట్​లేక ఫోన్లు కూడా మూగబోవడంతో ఫోన్ల ఆపరేటింగ్ వ్యవస్థ మొత్తాన్ని తాత్కాలికంగా కోఠిలోని 104 సేవల భవనానికి తరలించారు.