1.5 కోట్ల మంది అయోధ్య రాముడ్ని దర్శించుకున్నరు : ట్రస్ట్

1.5 కోట్ల మంది అయోధ్య రాముడ్ని దర్శించుకున్నరు  :  ట్రస్ట్

అయోధ్యకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.  జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి  అయోధ్య రామమందిర నిర్మాణాన్ని సుమారు 1.5 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ విషయాన్ని  శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. రామ్ లల్లా దర్శనం కోసం ప్రతిరోజూ సుమారు లక్ష మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. 

ఇటీవల శ్రీరామనవమి వేడుకులు అయోధ్య రామమందిరంలో ఘనంగా జరిగాయి. ఆ రోజు దాదాపు 19 గంటల పాటు ఆలయాన్ని తెరచి ఉంచినట్లుగా చంపత్ రాయ్ తెలిపారు. రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగిన ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పూర్తయ్యింది.. , మొదటి అంతస్తు పనులు కొనసాగుతున్నాయని  ఆయన వివరించారు. ఆలయం చుట్టూ 14 అడుగుల వెడల్పుతో ప్రాకారాన్ని నిర్మించనున్నామని, దీనిని ఆలయ పర్కోట అంటారని వివరించారు

కాగా  జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. జనవరి 23 నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించడంతో అయోధ్యకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.  రాముడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు లాంటి ఏదో ఒక గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. హారతి కార్యక్రమానికి ఉచితంగానే పాస్‌ ఇస్తారు 

దర్శన వేళలు : ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు

జాగరణ హారతి : ఉదయం 6.30 గంటలకు (ఒక రోజు ముందుగానే అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది)

సంధ్యా హారతి: రాత్రి 7.30 గంటలకు (అందుబాటును బట్టి అదే రోజు బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది)