
- ఫ్రాన్స్, జర్మనీలో కంటే మన దగ్గర ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఉన్నారు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం పెరుగుతోంది. ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రజల్లో అవగాహన పెరగడంతో పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్లు షేర్లను కొంటున్నారు. ఇండియాలోని 22–23 శాతం కుటుంబాలు ప్రస్తుతం డైరెక్ట్‌గా లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాయని ఎన్‌ఎస్‌ఈ సీఈఓ ఆశిష్ చౌహాన్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఫ్రాన్స్, జర్మనీలో కంటే మన దగ్గరే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఉన్నారని అన్నారు.
‘1991–92 లో నేను జాయిన్ అయినప్పుడు ఇండియాలో 10 లక్షల మంది ఇన్వెస్టర్లు ఉండేవారు. ప్రస్తుతం 11 కోట్ల యునిక్ ఇన్వెస్టర్లు ఉన్నారు. వీరి సంఖ్య 110 రెట్లు పెరిగింది. తలసరి ఆదాయం తక్కువగా ఉన్న దేశాల్లోని ప్రజలు షేర్లలో ఇన్వెస్ట్ చేయరు. వీరి దగ్గర ఇన్వెస్ట్ చేసేంత డబ్బులు ఉండవు. కానీ, ఇండియాలో ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులను మార్కెట్‌లో పెడుతున్నారు. అస్సాంలోని జోర్హట్‌లో ఉన్న ఓ మహిళ, తమిళనాడు సేలంలో ఉన్న వ్యాపారవేత్తను నమ్ముతోంది.
తానెప్పుడు డైరెక్ట్‌గా చూడని బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేస్తోంది. సాధారణ ప్రజలు, వ్యాపారవేత్తల మధ్య నమ్మకం పెరుగుతోంది. నా దృష్టిలో గత 78 ఏళ్ల ఇండిపెండెన్స్‌లో ఇండియా సాధించిన అతి ముఖ్యమైన విజయం ఇదే’ అని చౌహాన్
వివరించారు.
ఇన్వెస్టర్లు ఎందుకు పెరుగుతున్నారంటే?
‘2014 లో 1.6 కోట్ల మంది ఇన్వెస్టర్లు ఉండేవారు. కొవిడ్ టైమ్‌కి వీరి సంఖ్య 2.5 కోట్లకు చేరింది. ప్రస్తుతం 11 కోట్లకు పెరిగింది. చాలా తక్కువ ఖర్చుకే బ్రోకరేజ్ సర్వీస్‌లను కంపెనీలు అందిస్తున్నాయి. వీడియో కేవైసీతో మారుమూల ప్రాంతాలకు కూడా ఇవి వెళుతున్నాయి. స్టాక్ మార్కెట్ అంటే కేవలం ట్రేడింగ్ మాత్రమే కాదు. ప్రజలు సేవింగ్స్‌ను కంపెనీల ప్రొడక్టివిటీ పెంచడానికి వాడే సాధనం’ అని చౌహాన్ అభిప్రాయపడ్డారు.
సెబీ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో 50–60 శాతం మేర స్పెక్యులేటివ్ (ఆప్షన్స్) ట్రేడింగ్ వాల్యూమ్స్ పడిపోయాయని తెలిపారు. రెగ్యులేటర్స్ కఠినమైన చర్యలు తీసుకుంటాయని, కానీ ఇవి మార్కెట్‌పై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుతాయని అన్నారు. మార్కెట్ పెరుగుతుంటే ఐపీఓలు రావడం సాధారణమని తెలిపారు.