జులైలో చనాకా – కొరాట ప్రారంభం

జులైలో చనాకా – కొరాట ప్రారంభం
  • ఏర్పాట్లు చేస్తున్న ఇరిగేషన్​ఇంజినీర్లు 

హైదరాబాద్, వెలుగు: చనాకా – కొరాట బ్యారేజీ కమ్​ లిఫ్ట్​ స్కీమ్​ను జులైలో ప్రారంభించేందుకు ఇరిగేషన్​ఇంజినీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పంపుహౌస్ నిర్మాణం పూర్తయిందని, సీఎం కేసీఆర్​చేతుల మీదుగా జులై మొదటి వారంలో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ లిఫ్ట్ కింద 13,500 ఎకరాలు, గ్రావిటీ కెనాల్​కింద 48 వేల ఎకరాలకు సాగు నీరందిస్తారు. ప్రాజెక్టులో 80 కి.మీ.ల గ్రావిటీ కెనాల్​తవ్వారు. ఇందులో 49 కి.మీ.ల వద్ద పంపుహౌస్​ఏర్పాటు చేశారు. ఇక్కడ ఐదు మోటార్లు బిగించారు. ఆయకట్టుతో పాటు ఆదిలాబాద్​జిల్లాలోని థాంసీ, జైనథ్, ఆదిలాబాద్​మండలాల్లోని 14 గ్రామాలకు తాగు, సాగునీరు అందిస్తారు. 

1975లో ఒప్పందం

పెన్​గంగా నదిపై చనాకా – కొరాట బ్యారేజీ నిర్మాణానికి 1975లోనే ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. కానీ ప్రాజెక్టు నిర్మించలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016, ఆగస్టులో మహారాష్ట్ర, తెలంగాణ సీఎంల సమక్షంలో అగ్రిమెంట్​చేసుకున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్​జిల్లాలోని కేలాపూర్​తహసీల్​పరిధిలో గల తొమ్మిది గ్రామాలకు సాగు, తాగునీరు అందించనున్నారు. ఇంటర్​స్టేట్​ప్రాజెక్టు అయిన చనాకా – కొరాటను తెలంగాణ ప్రభుత్వ నిధులతోనే నిర్మించారు. ఈనెల 28న ఇంటర్​స్టేట్​బోర్డు కో ఆర్డినేషన్​కమిటీ సమావేశం నిర్వహించి, నిధుల బదలాయింపు సహా ఇతర టెక్నికల్​అంశాలపై చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీలోని టెక్నికల్​అడ్వైజరీ కమిటీ గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన తెలంగాణ, ఏపీ సీఎంలు సభ్యులుగా ఉన్న అపెక్స్​కౌన్సిల్​దీనికి ఆమోదం తెలపాల్సి ఉంది.