మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

V6 Velugu Posted on Apr 29, 2021

2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో  1,539 పోలింగ్​ కేంద్రాల ఏర్పాటు
 డ్యూటీలో 9,809 మంది సిబ్బంది    4,557 మంది పోలీసులతో బందోబస్తు

హైదరాబాద్​, వెలుగు: ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో ఎన్నికలకు ఏర్పాట్లను పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పార్థసారథి ప్రకటించారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ జరుగుతుందని చెప్పారు. వరంగల్​, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్​, కొత్తూర్​, జడ్చర్ల మున్సిపాలిటీలతో పాటు నల్గొండ, గజ్వేల్​, పరకాల, బోధన్​లలో ఏర్పడిన ఖాళీలకు ఎన్నికలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొత్తంగా 1,539 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 9,809 మంది సిబ్బందిని ఎన్నికల డ్యూటీ కోసం నియమించామని చెప్పారు. సిబ్బందికి మాస్కులతో పాటు ఫేస్​ షీల్డ్​, శానిటైజర్లను ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు తర్వాత గెలుపు సంబురాలు, ర్యాలీలను నిషేధిస్తున్నట్టు పార్థసారథి వెల్లడించారు. గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. ఎవరైనా రూల్స్​ను పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.  
కరోనా భయాలు 
కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇటు ఎన్నికల సిబ్బందితో పాటు అటు ఓటర్లలోనూ భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పార్థసారథి చెప్పారు. ఎన్నికలు జరుగుతున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మొత్తం 11.34 లక్షల మంది ఓటర్లున్నారు. 2,500 బ్యాలెట్​ బాక్సులను వాడుతున్నారు. గ్రేటర్​ వరంగల్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో ఎక్కువగా 878 పోలింగ్​ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అతితక్కువగా కొత్తూర్​ మున్సిపాలిటీలో 12 కేంద్రాలను పెట్టారు. ఎన్నికల సిబ్బందికి ఒక్కొక్కరికి రెండు మాస్కుల చొప్పున 28,810 మాస్కులు, 14,505 ఫేస్​ షీల్డ్​లు, 22,910 గ్లోవ్స్​, 18,455 శానిటైజర్లను అందుబాటులో పెడుతున్నారు. 4,557 మంది పోలీసులు ఎన్నికల బందోబస్తును నిర్వహించనున్నారు. 336 సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాలను గుర్తించారు. ఓటర్లు ఆరు అడుగుల దూరంలో ఉంటూ ఓటేసేలా ఏర్పాట్లు చేసినట్టు మున్సిపల్​ అండ్​ అర్బన్​ డెవలప్​మెంట్​ శాఖ సెక్రటరీ అర్వింద్​ కుమార్​ తెలిపారు.

Tagged Telangana, POLICE, corona, Municipal Elections, poling, corporations,

Latest Videos

Subscribe Now

More News