పాలమూరు–రంగారెడ్డి టన్నెల్​పై వెంచర్

పాలమూరు–రంగారెడ్డి టన్నెల్​పై వెంచర్

జడ్చర్ల, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నీటి తరలింపు కోసం వందల కోట్లు పెట్టి కట్టిన టన్నెల్​పై రియల్టర్లు దర్జాగా వెంచర్​ వేస్తున్నారు. సర్కారు 2017లోనే టన్నెల్ కోసం ల్యాండ్​ సేకరించి, భూములు కోల్పోయినవాళ్లకు పరిహారం సైతం అందించింది. సొరంగం సేఫ్టీ దృష్ట్యా ఆ మార్గంలో ఎలాంటి  పనులు చేపట్టవద్దని రూల్స్​చెబుతున్నా ఆఫీసర్లు గుడ్డిగా పర్మిషన్లు ఇచ్చేశారు. రూలింగ్​పార్టీ లీడర్ల అండ కూడా ఉండడంతో  రియల్టర్లు టన్నెల్​పైనే వెంచర్లు, వాటి కోసం రోడ్లు వేసి ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో పట్టపగలు సాగుతున్న ఈ అక్రమ బాగోతాన్ని ఆఫీసర్లు గుడ్లు అప్పగించి చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 

టన్నెల్​ మీదే వెంచర్​.. 
పాలమూరు- – రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉదండాపూర్​ రిజర్వాయర్​కు అనుసంధానంగా ఆలూరు – ఉదండాపూర్​గ్రామాల మధ్య 9 కిలోమీటర్ల పొడువునా సొరంగ మార్గం నిర్మాణం పూర్తిచేశారు. ఇందుకోసం 2017లోనే జడ్చర్ల  మండలం మల్లెబోయినపల్లి శివారులోని 52 నుంచి 117 వరకు వివిధ నంబర్లలో సుమారు 9ఎకరాలు సేకరించారు. ఇందుకు 41మంది రైతులకు  ఎకరానికి రూ.2 లక్షల చొప్పున రూ. 54.41 లక్షల  పరిహారం అందజేశారు. ఈమేరకు 2017 అక్టోబర్​12న కలెక్టర్​ ప్రొసీడింగ్స్​ఇష్యూ చేశారు. జడ్చర్ల ను ఆనుకొని అప్పుడు టన్నెల్​ నిర్మించిన సర్వే నంబర్లు56, 57, 58, 102లోని 2.14 ఎకరాల భూమిని కలుపుకుంటూ ఇప్పుడు సుమారు 100 ఎకరాల్లో భారీ వెంచర్​ వేస్తున్నారు. 44వ నేషనల్​ హైవేను ఆనుకొని ఉన్న ఈ వెంచర్​లో లోకల్​గా ఉన్న రూలింగ్​ పార్టీ లీడర్లకు భాగం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలా మేనేజ్ ​చేశారో తెలియదుగానీ  ఆఫీసర్ల నుంచి అన్ని పర్మిషన్లు వచ్చినట్లు చెబుతున్నారు. కాగా, టన్నెల్​ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించడమేగాక, వెంచర్​ వేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో వెంచర్​ కోసం మల్లెబోయినపల్లి గ్రామ శివారులోని చెరువును  కూడా రియల్టర్లు కబ్జా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. సొరంగంపై వెంచర్​ ఏర్పాటుకు ఆఫీసర్లు ఎలా పర్మిషన్​ ఇచ్చారని,  భవిష్యత్తులో ఏదైనా ప్రమాదాలు జరిగితే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని లోకల్​ పబ్లిక్​ ప్రశ్నిస్తున్నారు.