నిజామాబాద్ లో ఏసీబీకి చిక్కిన సీనియర్​ అసిస్టెంట్

నిజామాబాద్ లో ఏసీబీకి చిక్కిన సీనియర్​ అసిస్టెంట్
  • తోటి ఉద్యోగి సర్వీస్ బుక్​ఇవ్వడానికి లంచం డిమాండ్​
  • ఎంపీడీవో చెప్పడంతో తీసుకున్నానన్న హరిబాబు   
  • ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న అధికారులు

నిజామాబాద్/భిక్కనూరు, వెలుగు: బాల్కొండ సెగ్మెంట్​కమ్మర్​పల్లి ఎంపీడీవో ఆఫీస్​లో సీని యర్​ అసిస్టెంట్ హరిబాబు మరో ఉద్యోగి నుంచి రూ.8 వేల లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి రెడ్​హ్యాండెడ్​గా​చిక్కాడు. గత ఎంపీడీవో సంతోష్​రెడ్డి సూచన మేరకే లంచం తీసుకున్నట్లు చెప్పడంతో ఇద్దరిపై కేసు నమోదైంది. ఏసీబీ డీఎస్పీ శేఖర్​గౌడ్​ కథనం ప్రకారం..అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాగయ్య అనే సీనియర్​అసిస్టెంట్​ కమ్మర్​పల్లి ఎంపీపీ ఆఫీస్​లో ఇన్​చార్జ్​ఎంపీవోగా డ్యూటీ చేశాడు. రెగ్యులర్​ ఎంపీవో వచ్చాక మూడు నెలల కింద ఇందల్​వాయి మండలానికి బదిలీ అయ్యాడు. కమ్మర్​పల్లిలో పనిచేసిన వివరాలను సర్వీస్​బుక్​లో ఎంట్రీ చేయాలని ఎంపీడీవో సంతోష్​రెడ్డికి బుక్​ ఇవ్వగా రూ.10 వేల లంచం డిమాండ్​ చేశాడు.

పార్లమెంట్​ఎన్నికల నేపథ్యంలో కమ్మర్​పల్లి ఎంపీడీవోగా ఉన్న సంతోష్​రెడ్డి నెల కింద భిక్కనూర్​ మండలానికి ట్రాన్స్​ఫర్​ అయ్యాడు. అంతకు ముందే బాగయ్య సర్వీస్​బుక్​లో ఎంటర్​ చేయాల్సిన వివరాలు రాసి రూ.10 వేలు ఇచ్చేదాకా బుక్​ ఇవ్వొద్దని సీనియర్ ​అసిస్టెంట్ ​హరిబాబుకు అప్పగించాడు. బాగయ్య సర్వీస్​ బుక్​ కోసం సీనియర్​అసిస్టెంట్​హరిబాబును కలువగా ఎంపీడీవో సంతోష్​రెడ్డి చెప్పిన లంచం గురించి ప్రస్తావించాడు. రూ.8 వేలకు ఒప్పందం చేసుకున్న బాగయ్య విషయాన్ని ఏసీబీకి చేరవేయగా డీఎస్పీ శేఖర్​గౌడ్ ​నేతృత్వంలో రైడ్​ నిర్వహించి హరిబాబును రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఎంపీడీవో సంతోష్​రెడ్డి చెప్పినట్టే చేశానని చెప్పగా భిక్కనూర్ ఆఫీస్ ​నుంచి సంతోష్​రెడ్డిని కమ్మర్​పల్లికి తీసుకొచ్చారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు డీఎస్పీ శేఖర్​గౌడ్​ వెల్లడించారు.