ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ ప్రోగ్రామ్స్

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ ప్రోగ్రామ్స్

వెలుగు, నెట్​వర్క్​: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అరైవ్​ అలైవ్​ప్రోగ్రామం చేపట్టి, పలుచోట్ల ఉచిత వైద్య శిబిరాలు, సురక్షిత ప్రయాణంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వరంగల్​ మామునూర్​ 4వ బెటాలియన్​లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని కమాండెంట్​ శివప్రసాద్​రెడ్డి, ఎన్.హనీ ప్రారంభించారు. ​​జనగామలో సరోజిని కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏఎస్పీ పండేరి చేతన్​నితిన్​ప్రారంభించి, పరీక్షలు చేయించుకున్నారు.

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని డీఎస్పీ కిశోర్ ​ప్రారంభించగా, 560 మంది వాహన డ్రైవర్లు, యజమానులు, ఇతరులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేశారు. వరంగల్​ జిల్లా పర్వతగిరి సర్కిల్​ పరిధిలో సీఐ రాజగోపాల్​ కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించి, పరీక్షలు నిర్వహించారు. ఖమ్మం సిటీలో వన్​టౌన్​ సీఐ కరుణాకర్​ బైకర్స్​కు హెల్మెట్, ట్రాఫిక్​ నిబంధనలపై అవగాహన కల్పించారు. కామేపల్లి మండలం లింగాల క్రాస్​రోడ్డులో ఎస్సై శ్రీకాంత్, మధిర మండలం బోనకల్​ పోలీస్​ స్టేషన్​లో గ్రామ పాలకులు, ప్రజలకు వైరా ఏసీపీ సారంగపాణి రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.