రేపు(ఏప్రిల్ 13) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్

రేపు(ఏప్రిల్ 13) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్
  •     రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు
  •     ఆరు రోజుల షెడ్యూల్ విడుదల చేసిన మున్సిపల్ శాఖ
  •     మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రోడ్డు భద్రత ర్యాలీలు

హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి "అరైవ్ అలైవ్" కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. 'ప్రజా పాలన–ప్రగతి నివేదిక' 99 రోజుల ప్రోగ్రామ్ లో భాగంగా.. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ఆరు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్​ శాఖ శనివారం షెడ్యూల్​ రిలీజ్​ చేసింది. 

షెడ్యూల్ ప్రకారం.. తొలిరోజు ఏప్రిల్​13న పట్టణ స్థాయి రోడ్డు భద్రత కమిటీల ఏర్పాటు, 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద విద్యార్థులు, యువతతో రోడ్డు భద్రత ప్రమాణ స్వీకారం, 15న “చిల్డ్రెన్ రోడ్ సేఫ్టీ డే”  4 ఏండ్లు పైబడిన పిల్లలకు సీట్ బెల్ట్ వినియోగంపై అవగాహన, 16న ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రత్యేక ప్రచారం, సోషల్ మీడియా ద్వారా అవగాహన, 17న ప్రమాదాల అనంతరం తక్షణ వైద్య సహాయం కోసం “గోల్డెన్ అవర్” శిక్షణ కార్యక్రమాలు, చివరి రోజు ఏప్రిల్​18న ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  అన్నీ జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్​ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రమాదాలు ఎక్కువ జరిగే చోట్ల(బ్లాక్ స్పాట్స్) వద్ద అవగాహన ర్యాలీలు, పోస్టర్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్‌‌లు నిర్వహించాలని.. ఆటో, లారీ డ్రైవర్లు, విద్యార్థులు, మహిళలు, గ్రామీణ ప్రజలకు సదస్సులు నిర్వహించాలని సూచించింది. 

తుది లక్ష్యం ప్రజల ప్రాణాలను కాపాడటమే

“అరైవ్ అలైవ్” కార్యక్రమం సక్సెస్ చేయాలని అధికారులను సీఎస్ రామకృష్ణారావు ఇటీవల  జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో ఆదేశించారు. "రాష్ట్రంలో ఏటేటా వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మెరుగైన రహదారులు ఉన్నప్పటికీ.. సరైన డ్రైవింగ్ శిక్షణ లోపించడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదాల నివారణకు స్థానిక అవసరాలకు అనుగుణమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచాలి. 

జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాలను తరచూ నిర్వహిస్తూ.. 'అరైవ్ అలైవ్' కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి"  అని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. “అరైవ్ అలైవ్”లో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.  మన తుది లక్ష్యం ప్రజల ప్రాణాలను కాపాడటమేనని సీఎస్ పేర్కొన్నారు.