ఉపరాష్ట్రపతి స్థానం..ఎన్నిక వివాదాలు

ఉపరాష్ట్రపతి స్థానం..ఎన్నిక వివాదాలు

రాజ్యాంగంలోని ఐదో విభాగంలో 63 నుంచి 71 వరకు గల ఆర్టికల్స్​ ఉపరాష్ట్రపతి గురించి వివరిస్తాయి. దీన్ని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఉపరాష్ట్రపతికి రాజ్యాంగంలో ఎలాంటి విధులను పేర్కొనలేదు. కానీ ఆర్టికల్​ 64 ప్రకారం హోదారీత్యా రాజ్యసభకు చైర్మన్​గా వ్యవహరిస్తారు. పార్లమెంట్​ సంస్థలతో రాజ్యసభ జరిపే అన్ని ఉత్తర, ప్రత్యుత్తరాలు ఉపరాష్ట్రపతి పేరుతోనే కొనసాగుతాయి. రాజ్యసభలో ఉపరాష్ట్రపతి సభ్యుడు కాకపోవడం వల్ల ఉపరాష్ట్రపతికి సాధారణ ఓటు హక్కు ఉండదు. కానీ ఏదైనా బిల్లు విషయంలో వ్యతిరేక, అనుకూల ఓట్లు సమానంగా వస్తే ఉపరాష్ట్రపతికి నిర్ణాయక ఓటు హక్కు ఉంటుంది. అమెరికా అధ్యక్ష పదవి ఖాళీ అయితే ఉపాధ్యక్షుడు పూర్తికాలానికి అధ్యక్షుడుగా వ్యవహరిస్తాడు. కాని భారత ఉప రాష్ట్రపతి ఒకవేళ రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే తిరిగి ఎన్నిక జరిగి కొత్త రాష్ట్రపతి నియామకం జరిగే వరకు మాత్రమే రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. 

ఎన్నిక - వివాదాలు

కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణను చేపడుతుంది. ఉప రాష్ట్రపతి నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఒక ఓటు బదిలీ ద్వారా రహస్య పద్ధతిలో పరోక్షంగా ఎలక్టోరల్​ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు. ఎలక్టోరల్​ కాలేజీలో పార్లమెంట్​ ఉభయ సభల సభ్యులు ఉంటారు. 1961 పూర్వం పార్లమెంట్​ ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే విధానం ఉండేది. 1961లో 11వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను రద్దు చేశారు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్​ కాలేజీలో లోక్​సభ, రాజ్యసభల్లో ఎన్నికైన సభ్యులతోపాటు నామినేటెడ్​ సభ్యులు కూడా ఉంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్టులో మాత్రమే సవాల్​ చేయాలి. ఈ పిటిషన్​పై ఎలక్టోరల్​ కాలేజీలోని 10 మంది సభ్యులు సంతకం చేయాలి. సుప్రీంకోర్టు ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదు అంటే ఉపరాష్ట్రపతిగా ఆయన గతంలో చేపట్టిన చర్యలు రద్దు కావు. 

రాజీనామా - తొలగింపు

ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి పంపించాలి. వి.వి.గిరి మాత్రమే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు.  రాజ్యసభ ఒక తీర్మానం ద్వారా నిరపేక్ష మెజారిటీతో ఉపరాష్ట్రపతిని తొలగిస్తున్నట్లుగా తీర్మానించాలి. దానిని లోక్​సభ సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. అయితే ఉపరాష్ట్రపతిని తొలగించడానికి మహాభియోగ తీర్మానం ఏదీ లేదు. ఈ తొలగింపు తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి 14 రోజుల ముందుగా ఉపరాష్ట్రపతికి నోటీసు జారీ చేయాలి. ఎంత మంది ఈ నోటీసుకు మద్దతు ఇవ్వాలనే విషయం రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఉపరాష్ట్రపతిని తొలగించడానికి గల నిర్ణీత కారణాలు రాజ్యాంగంలో తెలియజేయలేదు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించేటప్పుడు ఆయన్ని పదవి నుంచి తొలగించరాదు. 

కాలపరిమితి

ఉప రాష్ట్రపతి పదవీ ప్రమాణం చేసినప్పటి నుంచి ఐదేండ్ల కాలపరిమితి ఉంటుంది. 1952 నుంచి 1962 వరకు సర్వేపల్లి రాధాకృష్ణన్ సుదీర్ఘకాలం  ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. 1967 నుంచి 1969 వరకు వి.వి.గిరి అతి తక్కువ కాలం పదవిలో ఉన్నారు. కాలపరిమితి పూర్తయిన ఉపరాష్ట్రపతి కొత్త ఉప రాష్ట్రపతి పదవి స్వీకరించే వరకు పదవిలో కొనసాగుతారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నిసార్లయిన పోటీచేసి ఎన్నిక కావడానికి అర్హతను కలిగి ఉంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్​, హమీద్​ అన్సారీలు రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. కృష్ణకాంత్​ పదవిలో ఉండగా మరణించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కె.ఆర్. నారాయణన్​ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు.  

ఉప రాష్ట్రపతి స్థానం

రాజ్యాంగ పరంగా ఉపరాష్ట్రపతిగా ఎక్కువ అధికారాలు, విధులు సంక్రమించలేదు. అమెరికా ఉపాధ్యక్షునితో పోలిస్తే భారత ఉపరాష్ట్రపతిగా పదవి అప్రధానమైంది. అమెరికాలో అనుకోకుండా అధ్యక్ష పదవి ఖాళీ అయితే మిగిలిన పాలనా కాలానికి అమెరికా ఉపాధ్యక్షుడే.. అధ్యక్షునిగా వ్యవహరిస్తాడు. కానీ, భారతదేశంలో ఉపరాష్ట్రపతిగా గరిష్టంగా ఆరు నెలలు మాత్రమే రాష్ట్రపతిగా వ్యవహరించగలడు. టి.కె.తోపే అనే రచయిత ఉపరాష్ట్రపతిని వేల్స్ యువరాజుతో పోల్చాడు. రచయిత మాటల్లో ప్రధానమంత్రి, రాష్ర్టపతి ఎన్నో సమస్యల పరిష్కార విషయంలో ఉపరాష్ట్రపతిని సంప్రదిస్తారు.

ప్రస్తుతం ఉపరాష్ట్రపతి కాలపరిమితి ముగియడానికి ముందే తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించాలి. ఏవైనా పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోతే తదుపరి ఉపరాష్ట్రపతి వచ్చేంత వరకు ప్రస్తుత పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతే  తిరిగి కొనసాగుతారు. 

ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయడం
తొలగింపు తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని తొలగించడం
పదవిలో ఉండగా మరణించడం

ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం
అర్హతలు 

భారత పౌరసత్వం కలిగి ఉండాలి.
35 సంవత్సరాల కనీస వయస్సు ఉండాలి.
రాజ్యసభ సభ్యత్వం పొందడానికి కావాల్సిన అర్హతలు కలిగి ఉండాలి.
ఆదాయాన్నిచ్చే లాభదాయక ప్రభుత్వ పదవిని చేపట్టకూడదు.
చట్టసభల్లో సభ్యత్వం ఉండకూడదు.
ప్రభుత్వ ఉద్యోగులు పోటీ చేయరాదు. ఒకవేళ చేస్తే ఉద్యోగానికి రాజీనామా చేయాలి.

ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ప్రాథమికంగా 20 మంది, ద్వితీయంగా మరో 20 మంది ఎలక్టోరల్​ కాలేజీ సభ్యులు సమర్థించాలి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల డిపాజిట్​గా రూ.15,000 చెల్లించాలి.