సర్కారు బడుల్లో ఏఐ, డేటా సైన్స్ పాఠాలు..

సర్కారు బడుల్లో ఏఐ, డేటా సైన్స్ పాఠాలు..
  • సర్కారు స్కూల్ స్టూడెంట్లకు ఏఐ, డేటా సైన్స్ పాఠాలు
  • వారంలో డిజిటల్ లెర్నింగ్ క్లాసులు ప్రారంభం
  • 5 వేల హైస్కూళ్లలో అమలు చేయనున్న విద్యా శాఖ
  • 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు
  • జిల్లాలకు చేరిన ‘ఎ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్’ బుక్స్

హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్లలోని స్టూడెంట్లకు త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) క్లాసులు ప్రారంభంకానున్నాయి. వారం, పదిరోజుల్లో అన్ని హైస్కూళ్లలో డిజిటల్ లెర్నింగ్ క్లాసులను మొదలుపెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే టీచర్లకు ట్రైనింగ్ క్లాసులు ప్రారంభించారు. మారుతున్న కాలానికి తగ్గట్టు సర్కారు స్కూళ్ల విద్యార్థులను టెక్నాలజీని అందిచనున్నారు. 

రాష్ట్రంలో ‘ఫ్యూచర్ రెడీ తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వం కొత్తగా డిజిటల్ లెర్నింగ్ సబ్జెక్టును ప్రవేశపెడుతున్నది. గవర్నమెంట్, లోకల్ బాడీ, మోడల్ స్కూళ్లు, కేజీబీవీ, గురుకుల ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలోని 5వేల హైస్కూళ్లలోని 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ క్లాసులు చెప్పనున్నారు. దీనికోసం గతంలోనే ఫైజామ్ ఫౌండేషన్​తో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. 

విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ప్రత్యేకంగా ‘ఎ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్’ అనే పుస్తకాలను ప్రింట్ చేసించి 8లక్షలకు పైగా స్కూళ్లకు పంపించారు. ఇప్పటికే ఈ క్లాసులు చెప్పేందుకు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్, సోషల్ టీచర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో వాయిదా పడగా.. త్వరలోనే ట్రైనింగ్ పూర్తి చేయనున్నట్టు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ప్రతి జిల్లా నుంచి ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరి చొప్పున 8 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. 

ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో టీచర్..

6 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులకు రెగ్యులర్ సబ్జెక్టులతోపాటు డిజిటల్ లెర్నింగ్ సబ్జెక్టులనూ బోధించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫిజికల్ కంప్యూటింగ్, డేటా సైన్స్, కోడింగ్, డిజైన్ థింకింగ్, డిజిటల్ సిటిజన్‌‌షిప్‌‌ తదితర​ అంశాలపై అవగాహన కల్పించనున్నారు. డిజిటల్ లెర్నింగ్ క్లాసుల్లో కోడింగ్, డేటా సైన్స్‌‌ను మ్యాథ్స్ టీచర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిజికల్ కంప్యూటింగ్‌‌ను ఫిజికల్ సైన్స్ టీచర్లు, డిజైన్ థింకింగ్‌‌ను ఇంగ్లిష్ టీచర్లు, డిజిటల్ సిటిజన్‌‌షిప్‌‌ను సోషల్ టీచర్లు బోధించనున్నారు. అయితే, ఇప్పటికే పంపిణీ చేసిన పుస్తకాల్లోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసిన విద్యార్థులకు  అప్రిసియేషన్ సర్టిఫికేట్లు ఇవ్వనున్నారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను జిల్లా స్థాయిలో డిజిటల్ రిపోజిటరీలో భద్రపర్చనున్నారు. 

సైబర్ సెక్యూరిటీపై అవగాహన

డిజిటల్ లెర్నింగ్ క్లాసుల్లో సైబర్ సెక్యూరిటీ, సోషల్ మీడియాలో మోసాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఫ్రీ వైఫై, ఫ్రీ గేమ్స్ వల్ల కలిగే రిస్కులు, సోషల్ మీడియాలో ఏ అంశాలను షేర్ చేయాలి, ఏవి చేయకూడదనే విషయాలపై తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులను టెక్నాలజీలో సన్నద్ధం చేసి, వారిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.