డీలర్ల మాయాజాలం..పత్తి విత్తనాల కృత్రిమ కొరత..బ్లాక్​లో అమ్మకాలు

డీలర్ల మాయాజాలం..పత్తి విత్తనాల కృత్రిమ కొరత..బ్లాక్​లో అమ్మకాలు
  •     రెట్టింపు ధర..ఎమ్మార్పీ రేటు రశీదు
  •     స్టాక్​ బోర్డులో నిల్​...అధిక ధర చెల్లిస్తే స్పాట్​ లో విత్తనాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఈ విత్తనాలు వేస్తే అధిక దిగుబడి అంటూ ప్రచారం చేయిస్తారు. కృత్రిమ కొరత సృష్టిస్తారు. స్టాక్​ బోర్డులో నిల్​గా చూపిస్తారు. ఇంకేముంది డీలర్ల మాయాజాలంలో పడ్డ రైతులు ఆ విత్తనాల కోసం ఎగబడ్తారు. ఇదే అదునుగా భావించిన డీలర్లు రెట్టింపు ధరలతో డిమాండ్​ ఉన్న విత్తనాలను అమ్ముతూ రైతులను దగా చేస్తున్నారు. యూఎస్​ 7067 విత్తనాలు అధిక దిగుబడి ఇస్తాయంటూ జరిగిన ప్రచారంతో జిల్లాలోని పలు మండలాల్లో ఈ విత్తనాలను పలువురు డీలర్లు బ్లాక్​ చేసి రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. రశీదు మాత్రం ఎమ్మార్పీకే ఇస్తుండడం గమనార్హం. 

బ్లాక్​లో పత్తి విత్తనాలు 

నకిలీ విత్తనాలు అమ్మితే   కఠిన చర్యలు తీసుకుంటాం. విత్తనాలను బ్లాక్​ చేసి అమ్మితే సీరియస్​ యాక్షన్​ ఉంటుంది. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేటుకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మితే లైసెన్స్​ రద్దు చేస్తామని కలెక్టర్​, అగ్రికల్చర్​ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నా కొందరు డీలర్లు బ్లాక్​లో అధిక రేటుకు విత్తనాలు అమ్ముతున్నారు.  జిల్లాలోని సుజాతనగర్​, జూలూరుపాడు, చండ్రుగొండ, టేకులపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం, టేకులపల్లి, పాల్వంచ, బూర్గం పహడ్​తో పాటు పలు మండలాల్లో యుఎస్​ 7067 పత్తి విత్తనాలను కొందరు డీలర్లు బ్లాక్​ చేశారు.

ఈ విత్తనాలు వేస్తే అధిక దిగుబడి వస్తోందంటూ సీజన్​ మొదట్లోనే ప్రచారం చేశారు. ఇవి  తెగుళ్లను తట్టుకుంటాయంటూ కంపెనీల ప్రతినిధులతో కుమ్ముక్కైన కొందరు డీలర్లు  గ్రామాల్లో ప్రచారం చేయించారు. గులాబీ రంగు పురుగును ఈ విత్తనాలు తట్టుకొని అధిక దిగుబడి ఇస్తాయని తమ మాయ మాటలతో రైతులకు నమ్మకం కలిగేలా ప్రచారం చేశారు. దీంతో కొందరు రైతులు ముందస్తు అడ్వాన్స్​లు ఇచ్చి బుక్​ చేసుకున్నారు. 

రశీదు ఎమ్మార్పీ రేటుకే..ధర మాత్రం  రెట్టింపు 

రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న డీలర్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. యుఎస్​ 7067 విత్తనాల ప్యాకెట్​ ఎమ్మార్పీ ధర రూ. 864 ఉండగా బ్లాక్​ చేసిన డీలర్లు ఆ విత్తనాలను రూ. 1500 నుంచి రూ. 1,800 వరకు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారు. ఈ విత్తనాలు అసలు దొరకడం లేదు. రైతుల కోసం మేమే బ్లాక్​లో తీసుకొస్తున్నాం. ఎమ్మార్పీ రేటుకు రశీదు ఇస్తాం, మేం చెప్పిన రేటుకు మీరు కొనాల్సిందే. మీకు ఇష్టముంటే తీసుకోండి, అసలే ఈ విత్తనాలు దొరకడం లేదని  పలువురు డీలర్లు ఖరాఖండిగా పేర్కొంటుండడంతో రశీదు ఎమ్మార్పీకి తీసుకొని ఇక తప్పదని అధిక ధరలకు కొంటున్నారు.

కొన్ని మండలాల్లో అయితే రెట్టింపు రేటు పెట్టడంతో పాటు పైరవీలు చేసుకోవాల్సిన విధంగా కొందరు డీలర్లు ఈ పత్తి విత్తనాలను బ్లాక్​ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. స్టాక్​ బోర్డులో నిల్​గా చూపిస్తున్నారు. షాపుల తనిఖీ వచ్చిన అధికారులు కూడా స్టాక్​ బోర్డు ప్రకారం ఉన్నాయా లేదా అని చూసి వెళ్లిపోతున్నారు. 

బ్లాక్​ చేస్తే కఠిన చర్యలు తప్పవు 

పత్తి విత్తనాలతో పాటు ఏ రకమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను ఎమ్మార్పీ కంటే ఒక్క పైసా అధిక రేటుకు అమ్మినా చర్యలు తప్పవు. ఇప్పటికే డీలర్లకు మీటింగ్​ పెట్టి హెచ్చరించాం. కొన్ని రకాల పత్తి విత్తనాలు అధిక రేటుకు అమ్ముతున్నారనే ప్రచారంపై ప్రత్యేక నిఘా పెట్టిస్తా. అగ్రికల్చర్​, టాస్క్​ ఫోర్స్​, మండల ప్రత్యేక అధికారులు కూడా విత్తనాలు,ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. రైతులు కూడా కంప్లైంట్​ ఇవ్వడం లేదు.

విత్తనాలను బ్లాక్​ చేస్తున్నట్టు కానీ, ఎమ్మార్పీ కన్నా అధిక రేటుకు అమ్ముతున్నట్టు ఎవరైనా కంప్లైంట్​ చేస్తే అమ్మే వారిపై సీరియస్​ యాక్షన్​ తీసుకుంటాం. డీలర్​ షిప్​ రద్దు చేస్తాం. రైతులు ఒకే కంపెనీవి కాకుండా తమ పొలంలో రెండు మూడు రకాల విత్తనాలు వేసుకుంటే ఇబ్బంది ఉండదు. అధిక  దిగుబడి అంటూ వ్యాపారులు చెప్పే మాయ మాటలు నమ్మి మోసపోవద్దు. 

- బాబూరావు, డీఏఓ, భద్రాద్రికొత్తగూడెం