V6 News

లోయలో పడ్డ ట్రక్కు..18 మంది మృతి...ఇండియా – చైనా సరిహద్దులో ఘటన

లోయలో పడ్డ ట్రక్కు..18 మంది మృతి...ఇండియా – చైనా సరిహద్దులో ఘటన

ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌‌‌‌లోని ఇండో–చైనా సరిహద్దు ఏరియాలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అస్సాంలోని టిన్సుకియా జిల్లాకు చెందిన 22 మంది కూలీలతో వెళ్తున్న ట్రక్కు.. హయులియాంగ్-–చాగ్లాగామ్ రోడ్డు మీద అదుపుతప్పి 1000 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది కూలీలు మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఒక్కరు స్పల్ప గాయాలతో బయటపడ్డారు. 

ఈ ప్రమాదం ఈ నెల 8న రాత్రి జరిగినప్పటికీ గురువారం వరకు బయటపడలేదు. గాయపడిన ఓ కార్మికుడు 4 కి.మీ. నడిచి  బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) క్యాంప్‌‌‌‌కు చేరి అధికారులకు సమాచారం ఇచ్చాడు. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన అధికారులు గాయపడిన వ్యక్తిని ట్రీట్మెంట్ కోసం దిబ్రుగఢ్ (అస్సాం) మెడికల్ కాలేజీలో జాయిన్ చేశారు. లోయలో పడిన ట్రక్కు నుంచి 18 మంది మృతదేహాలను బయటకు తీశారు. గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. అర్మీ, ఎన్‌‌‌‌డీఆర్‌‌‌‌ఎఫ్, ఎస్‌‌‌‌డీఆర్‌‌‌‌ఎఫ్, జీఆర్‌‌‌‌ఈఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.