అరుణాచల్ ప్రదేశ్లో అగ్ని ప్రమాదం..700 షాపులు దగ్ధం

అరుణాచల్ ప్రదేశ్లో అగ్ని ప్రమాదం..700 షాపులు దగ్ధం

అరుణాచల్ ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజధాని ఇటానగర్ కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న నహర్లగున్ మార్కెట్లో భారీ ఎత్తున మంటలు ఎగసిపడటంతో  700కు పైగా దుకాణాలు కాలి బూడిదయ్యాయి. సుమారు రెండు గంటల పాటు మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాపక సిబ్బంది ఆలస్యంగా రావడంతోనే.. భారీ నష్టం జరిగిందని దుకాణదారులు వాపోతున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

ఈ ఘటనలో భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందికి వ్యతిరేకంగా వ్యాపారస్తులు, దుకాణదారులు నినాదాలు చేశారు. ఘటన జరిగినప్పుడు విధుల్లో ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, అధికారులను వెంటనే విధుల్లో నుంచి తొలగించాలన్నారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించి.. తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.