ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్​కు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్​కు బెయిల్

న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కామ్​ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు (ట్రయల్ కోర్టు) వెకేషన్ బెంచ్ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 48 గంటల పాటు బెయిల్ ఆర్డర్​ను నిలిపివేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్​ను కింగ్ పిన్​గా పేర్కొంటూ ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేశారు. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినా సానుకూల తీర్పు రాలేదు. అయితే.. సుప్రీంకోర్టు జోక్యంతో లోక్​సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. తర్వాత ఆయన జూన్ 2న మళ్లీ కోర్టు ముందు లొంగిపోయారు. తాజాగా తనకు బెయిల్ మంజూరు చేయాలని రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన ట్రయల్ కోర్టు వెకెషన్ బెంచ్ జడ్జి న్యాయ్ బిందూ.. తీర్పును రిజర్వ్ చేశారు. సాయంత్రం ఇచ్చిన తీర్పులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. రూ.1 లక్ష పూచీకత్తుతో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే బెయిల్ బాండుపై సంతకం చేసేందుకు వీలుగా 48 గంటల పాటు స్టే విధించాలని ఈడీ తరఫు అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా ఈ తీర్పుపై ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసేందుకు అవకాశం ఉందని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. అయితే, ఈడీ అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు.. అందుకు నిరాకరించింది. కేజ్రీవాల్ కు బెయిల్ రావడంతో ఈ కేసులో సహ నిందితులు తమకు కూడా బెయిల్ దక్కేందుకు మార్గం సుగమం అయిందని భావిస్తున్నారు. తాజాగా కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగియగా.. జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో కవితకు కూడా బెయిల్ వస్తుందని ఆమె కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

కేజ్రీవాల్​కు బెయిల్​పై రేపు ఢిల్లీ హైకోర్టుకు ఈడీ

కేజ్రీవాల్​కు రౌస్ ఎవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఢిల్లీ హైకోర్టులో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం(రేపు) సవాలు చేయనుంది. ట్రయల్ కోర్టులో డ్యూటీ మెజిస్ట్రేట్ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తున్నదని ఈడీ డైరెక్టర్ రాహుల్ నవీన్ అన్నారు. కేజ్రీవాల్ బెయిల్​ను వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.