జిల్లాకో గోశాల

జిల్లాకో గోశాల

రాజ్ కోట్: గుజరాత్ లో అధికారంలోకి వస్తే ఆవుల సంరక్షణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ కన్వీనర్​ అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆదివారం ఆయన రాజ్ కోట్ లో మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీలో ఒక్కో ఆవు సంరక్షణ కోసం రోజుకు రూ.40 కేటాయిస్తున్నాం. ఇందులో రూ.20 ప్రభుత్వం, మరో రూ.20 మున్సిపల్ కార్పొరేషన్ భరిస్తోంది. మేం గుజరాత్ లో అధికారంలోకి వస్తే ఢిల్లీలో లాగే ఒక్కో ఆవు కోసం రోజుకు రూ.40 ఖర్చు చేస్తం” అని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

పాలు ఇవ్వని, రోడ్లపై తిరిగే ఆవుల సంరక్షణ కోసం జిల్లాకో గోశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘‘గుజరాత్​లో మేం అధికారంలోకి వస్తామని ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్టు ఇచ్చింది. దీంతో మమ్మల్ని ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి. యాంటీ బీజేపీ ఓట్లు మాకు రాకుండా కాంగ్రెస్​ను బీజేపీనే బలోపేతం చేస్తోంది” అని ఆరోపించారు. అయినప్పటికీ కాంగ్రెస్ కు 10కి మించి సీట్లు రావని అన్నారు. కాగా, ఇచ్చిన హామీ మేరకు సర్కార్ నిధులివ్వలేదని గుజరాత్​లోని కౌ షెల్టర్ హోమ్స్ నిర్వాహకులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు కేజ్రీవాల్ హామీలు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

కేజ్రీవాల్ పైకి వాటర్ బాటిల్..   

గుజరాత్ లో కేజ్రీవాల్ పైకి వాటర్ బాటిల్ విసిరారు. రాజ్ కోట్ లో శనివారం రాత్రి నిర్వహించిన గార్బా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్టేజ్ దగ్గరికి కేజ్రీవాల్ వెళ్తున్న క్రమంలో గుంపులో నుంచి ఎవరో వాటర్ బాటిల్ విసిరారు. అయితే అది ఆయనకు తగల్లేదు. తల  పైనుంచి దూసుకెళ్లింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేజ్రీవాల్ లక్ష్యంగానే బాటిల్ విసిరినట్లు తెలుస్తోందని, అయితే పోలీస్ కంప్లయింటేమీ ఇవ్వలేదని ఆప్ నేతలు చెప్పారు.