ఆప్ ఇక జాతీయ పార్టీ : కేజ్రీవాల్

ఆప్ ఇక జాతీయ పార్టీ  : కేజ్రీవాల్

బీజేపీకి కంచుకోటలా ఉన్న గుజరాత్ ను ఛేదించడంలో తాము విజయం సాధించామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రానున్న రోజుల్లో తాము అక్కడి నుంచి విజయం సాధించేందుకు ఇవాళ వచ్చిన ఫలితాలు బలమైన పునాదులు వేశాయన్నారు.  ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ‘‘మేం ఎవరిపైనా విమర్శలు చేస్తూ  గుజరాత్ లో  విష ప్రచారం చేయలేదు. గత 75 ఏళ్ల నుంచి దేశంలో తిట్ల రాజకీయమే జరిగింది. మేం అభివృద్ధి కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నం. అభివృద్ధి గురించే ప్రజలతో మాట్లాడాం. అందుకే మమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.  

‘‘గుజరాత్ ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరించారు. వాళ్లకు రుణపడి ఉంటా. ఈ ఎన్నికల్లో గుజరాత్ నుంచి ఎంతో నేర్చుకున్నాం’’ అని చెప్పారు. ఇప్పుడు ఆప్ ఒక జాతీయ పార్టీగా ఆవిర్భవించిందన్నారు.  ఆప్ ను జాతీయ పార్టీగా మార్చేందుకు కృషిచేసిన వారందరికీ కేజ్రీవాల్ ధన్యవాదాలు  తెలిపారు. ‘‘ ఎన్నికలు వస్తాయి.. పోతాయి.. మనం ప్రజా సేవ చేయడానికి సదా సిద్ధంగా ఉండాలి.. ఆపదలో , కష్టాల్లో ఉన్నవారికి సాయపడుతూ ముందుకు సాగండి.. ఓట్లు కూడా మనకు వచ్చి తీరుతాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.