గుజరాత్‌‌పై ఆప్ ఫోకస్.. కేజ్రీవాల్ కీలక హామీ

గుజరాత్‌‌పై ఆప్ ఫోకస్.. కేజ్రీవాల్ కీలక హామీ

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాగా వేయాలని ఆప్ భావిస్తోంది. ఢిల్లీలో అధికారలోకి వచ్చిన అనంతరం పంజాబ్ లో ఘన విజయం సాధించింది. అనంతరం గుజరాత్ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా గుజరాత్ ప్రజలకు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక హామీనిచ్చారు. 10 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కాకుండా నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతిని ఇస్తామని ప్రకటించారు. ఐదు సంవత్సరాల్లో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించడమే తమ లక్ష్యమన్నారు. గిరిసోమ్ నాథ్ జిల్లాలోని వెరావల్ లో ఆప్ బహిరంగసభ నిర్వహించింది. ఈ సభలో కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు.

ఉచితంగానే నీరు, విద్యుత్, ఢిల్లీ తరహాలో విద్య, వైద్యం అందిస్తామని మరోసారి గుజరాత్ ప్రజలకు ఆయన హామీనిచ్చారు. ఉచిత విద్య, వైద్యం అందించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందనే విమర్శలను ఆయన కొట్టిపారేశారు. రాష్ట్ర అప్పులను ప్రజల ముందు పెట్టారు. దాదాపు రూ. 3.5 లక్షల కోట్లు అప్పులున్నాయని వెల్లడించారు. ఏదీ ప్రజలకు ఉచితంగా ఇవ్వకుండానే ఇన్ని కోట్ల అప్పులు ఎలా అయ్యాయని ప్రశ్నించారు. అవినీతి వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకపోయిందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న గొప్ప పనులను ప్రపంచానికి తెలియచేయాలని సింగపూర్ ప్రభుత్వం తమను ఆహ్వానించిందన్నారు. కానీ తనను వెళ్లనివ్వలేదని తెలిపారు.