న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాను 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం ఆదివారం నియమించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ రిత్విక్ రంజన్ పాండే కమిషన్‌కు కార్యదర్శిగా వ్యవహరిస్తారని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. కమిషన్ తన ఐదేళ్ల కాలానికి (2026-–27 నుంచి 2030-–31 వరకు) తన నివేదికను 2025 అక్టోబర్ 31 నాటికి రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గత నెలలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 16వ ఆర్థిక సంఘం విధివిధానాలకు (టీవోఆర్) ఆమోదం తెలిపింది.
కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ ఆదాయ పెంపు చర్యలను సూచించడంతోపాటు, విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం ఏర్పాటు చేసిన నిధులకు సంబంధించి విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రస్తుత ఏర్పాట్లను కమిషన్ సమీక్షిస్తుంది. ఫైనాన్స్ కమిషన్ అనేది కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సూచనలు ఇచ్చే రాజ్యాంగ సంస్థ.
