రామకృష్ణ మఠంలో గర్భిణులకు హెల్త్​ గైడ్  ఆర్యజనని

రామకృష్ణ మఠంలో గర్భిణులకు హెల్త్​ గైడ్  ఆర్యజనని
  •     ఐదేండ్లుగా కొనసాగుతున్న ఆర్యజనని
  •     ఆన్​లైన్, ఆఫ్​​లైన్​లో     ఏడాది పొడవునా క్లాసులు
  •     గైనకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్టులు, యోగా ట్రైనర్లతో సెషన్లు

హైదరాబాద్, వెలుగు: గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు గర్భిణులకు ఎన్నో అనుమానాలు. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. నలతగా అనిపించినా, మరేదైనా సమస్య వచ్చినా.. ఒత్తిడి, భయాందోళనకు గురవుతుంటారు.  ప్రస్తుతం అన్నీ చిన్నకుటుంబాలే అవడంతో సలహాలిచ్చేందుకు ఇంట్లో పెద్దవాళ్లు ఉండటంలేదు. ఇలాంటి వారికోసమే మేమున్నాం అంటూ పనిచేస్తోంది ‘ఆర్యజనని’. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో మొదలైన ఈ కార్యక్రమం బిడ్డకు రెండేళ్లు వచ్చేంత వరకు సుమారు వెయ్యి రోజుల పాటు గర్భిణుల ఆలనాపాలనా చూస్తూ మార్గదర్శిగా భరోసానిస్తోంది. ఐదేళ్లుగా ఎంతో మందికి గైడ్​లా పనిచేస్తోంది.

అన్ని అంశాలపై అవగాహన

గర్భిణులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఐదేళ్ల క్రితం ‘ఆర్యజనని’ని ప్రారంభించారు. గైనకాలజిస్ట్‌‌‌‌లు, క్లినికల్ సైకాలజిస్ట్‌‌‌‌లు జాగ్రత్తల గురించి సెషన్లలో వివరిస్తున్నారు. నిద్రలేమి, అధిక ఒత్తిడి నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన సలహాలు అందిస్తున్నారు. గర్భధారణ నుంచి బిడ్డకు రెండేళ్లు వచ్చేంత వరకు అన్ని అంశాల గురించి ఆన్​లైన్, ఆఫ్‌‌‌‌లైన్ సెషన్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఆన్​లైన్‌‌‌‌లో ప్రతి నెలా మొదటి ఆదివారం తెలుగులో.. రెండు, నాలుగో ఆదివారాల్లో ఇంగ్లీష్‌‌‌‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు సెషన్లు నిర్వహిస్తున్నారు. ఆఫ్‌‌‌‌లైన్​లో రామకృష్ణ మఠంలో ప్రతి నెలా రెండు, నాలుగో శనివారం తెలుగు, ఇంగ్లీష్ లో.. మూడో శని, ఆదివారం సెషన్లు నిర్వహిస్తున్నారు. ధ్యానం, యోగా, శ్రావ్యమైన గానం, ఒత్తిడిని తగ్గించుకునే ప్రక్రియలు, పౌరాణిక కథలతోపాటు జీవనశైలి, దినచర్య, ప్రణాళిక, ఆహార నియమాల గురించి వివరిస్తున్నారు. 

గైనకాలజిస్ట్‌‌‌‌లతో.. 

ఏడాది పొడవునా ఆర్యజనని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని గురించి గర్భిణులకు తెలియజేసేలా సిటీలోని అన్ని హాస్పిటల్స్​కు చెందిన గైనకాలజిస్ట్‌‌‌‌ల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. వలంటీర్లను హాస్పిటల్స్​కి పంపించి ఆర్యజననితో ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆన్​లైన్​లో అనేక మంది పాల్గొంటూ యోగా తో పాటు ధ్యానం ఎలా చేయాలో శిక్షణ తీసుకుంటున్నారు. అనేకమంది ఆర్యజననిలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేయించుకుంటున్నారని కార్యక్రమ నిర్వాహకులు చెప్తున్నారు. 

గొప్ప తల్లులతోనే మంచి సమాజం

గొప్ప మాతృమూర్తుల ద్వారానే గొప్ప సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుంది. బిడ్డ వికాసం గర్భం నుంచే మొదలవుతుంది. గర్భంలో ఉన్న శిశువు సద్గుణ సంపన్నులుగా పుట్టేలా గర్భిణికి సాయం అందించడమే ఆర్య జనని ముఖ్య ఉద్దేశం. పేరెంటింగ్ అనేది బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడే నుంచే జరగాలి. ఈ స్టేజీలో జాగ్రత్తగా ఉంటే పుట్టబోయే బిడ్డ సంస్కారవంతంగా ఉంటాడు. కానీ, ఈ కాలంలో తల్లులు ఒత్తిడి, భయం, ఆందోళనకు గురవుతున్నారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఆమెకు సపోర్టుగా నిలిస్తే పుట్టబోయే బిడ్డ మంచి తేజస్సుతో పుడుతుంది. 
- స్వామి శితికంఠానంద, 
ఆర్యజనని రూపకర్త