ఆర్మూర్, వెలుగు : ఇరవై ఏండ్ల కింద ప్రేమించి పెండ్లి చేసుకున్న భర్త మరో అమ్మాయితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా నిలదీయడంతో సదరు యువతితో పారిపోయాడని ఆర్మూర్‌కు చెందిన కాశీపాక మధులత వాపోయింది. మంగళవారం ఆర్మూర్‌లోని ప్రెస్‌క్లబ్ లో మీడియాతో మధులత తన గోడును వెలిబుచ్చింది. భర్త మదనం రాములుపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వేడుకుంది. ప్రస్తుతం ఖానాపూర్ ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా ఉన్న తన భర్త ఓ స్టూడెంట్ తో ప్రేమ వ్యవహారం నడిపి ఆమెను పెండ్లి చేసుకుంటానని తనతో అనేకసార్లు గొడవపడ్డాడని తెలిపారు.
నవంబర్ 5న పోలీసులకు ఫిర్యాదు చేశానని, కేసు నమోదైందన్నారు. రాములు అరాచకాలను ప్రశ్నించి, తాను మరో పెండ్లికి ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి నగలు, ఆస్తి పత్రాలు, డబ్బులతో రెండు రోజుల కింద ఆ అమ్మాయితో పారిపోయాడని చెప్పింది. ప్రస్తుతం తనకు తన పిల్లలకు ఎటువంటి రక్షణ లేకుండా పోయిందని, భర్త అరాచకాలపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరింది. మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు తనకు అండగా ఉండాలని కోరింది.
