వంద ఎకరాల్లో కూరగాయల సాగు.. తీర్మానించిన లింగంపల్లి గ్రామ రైతులు

వంద ఎకరాల్లో కూరగాయల సాగు.. తీర్మానించిన లింగంపల్లి గ్రామ రైతులు

లింగంపేట, వెలుగు : వరికి బదులు వంద ఎకరాల్లో కూరగాయల సాగు చేసేందుకు లింగంపల్లి సర్పంచ్ గొల్ల ప్రత్యూష ఆధ్వర్యంలో గ్రామ రైతులు తీర్మానం చేశారు. మంగళవారం ఓ ఫంక్షన్​హాల్​లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  హార్టికల్చర్ ఆఫీసర్​ సుమన్ మాట్లాడుతూ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్​ డెవలప్​మెంట్ హార్టి కల్చర్​(ఎంఐడీహెచ్​) ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ప్రభుత్వం  ఎకరానికి రూ.9,600 సబ్సిడీ ఇస్తుందన్నారు. హైదరాబాద్​లో కూరగాయల నారు ఉచితంగా అందజేస్తారని, రవాణా చార్జీలు పెట్టుకుంటే సరిపోతుందన్నారు.  

పందిరి సాగుకు డ్రిప్​పరికరాలను 50 శాతం సబ్సిడీపై అందజేస్తామని  చెప్పారు. టమాట, వంకాయ, బీర, కాకర, దొండ, మిరప, క్యాబేజీ, ఉల్లితో పాటు ఇతర కూరగాయలను పండించి అధిక లాభాలను పొందవచ్చన్నారు.  కార్యక్రమంలో గొల్ల కాశీరాం, సాయిరాం, తిరుపతి, సాయిలు, రాములు, స్వామి, భీమయ్య, బాలయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.