ట్రంప్ ప్రభుత్వం అమెరికా వెళ్లాలనుకునే విదేశీయులకు మరో భారీ షాక్ ఇచ్చింది. యూఎస్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే కొన్ని దేశాల పౌరులు ఇకపై భారీ మొత్తంలో 'వీసా బాండ్'లను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన పరిధిలోకి వచ్చే దేశాల సంఖ్యను ట్రంప్ ప్రభుత్వం ఏకంగా మూడు రెట్లు పెంచింది. తాజాగా మరో 25 దేశాలను ఈ జాబితాలో చేర్చడంతో.. మొత్తం 38 దేశాల పౌరులకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. జనవరి 21 నుండి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.
అసలు వీసా బాండ్ అంటే ఏంటి..?
అమెరికా పౌరసత్వం లేని వారు అక్కడికి వెళ్లిన తర్వాత.. తమ వీసా గడువు ముగియక ముందే తిరిగి స్వదేశానికి వచ్చేలా చూసేందుకు ఈ బాండ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దరఖాస్తుదారులు 5వేల డాలర్ల నుండి 15వేల డాలర్లు అంటే సుమారు రూ. 4లక్షల 20వేల నుండి రూ.12లక్షల 6 వేల వరకు బాండ్ రూపంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీసా తిరస్కరణకు గురైనా లేదా వీసా గడువు ముగిసిన తర్వాత నిబంధనల ప్రకారం తిరిగి స్వదేశానికి వచ్చేసిన వారికి తిరిగి చెల్లిస్తారు. అయితే వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోతే మాత్రం ఆ డబ్బును ప్రభుత్వం జప్తు చేస్తుంది.
ప్రభావితమయ్యే దేశాలు ఇవే..
తాజా జాబితాలో ఆఫ్రికా దేశాలతో పాటు ఆసియా, లాటిన్ అమెరికా దేశాలను చేర్చింది అమెరికా. అల్జీరియా, అంగోలా, ఆంటిగ్వా, బార్బుడా, బంగ్లాదేశ్, బెనిన్, బురుండి, కేప్ వెర్డే, క్యూబా, జిబౌటీ, డొమినికా, ఫిజీ, గాబన్, ఐవరీ కోస్ట్, కిర్గిజ్స్తాన్, నేపాల్, నైజీరియా, సెనెగా, టుగో, టుగో, టుగో వనాటు, వెనిజులా, జింబాబ్వే జనవరి 21 నుంచి బాండ్ లిస్టులో చేరనున్నాయి. దీంతో జాబితాలో 38 దేశాలు ఉండనున్నాయి. అలాగే వీసా పొందే ప్రక్రియను మరింత కఠినతరం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధికారులు సమర్థించుకుంటున్నారు. ఇప్పటికే వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా హిస్టరీని, గత పదేళ్ల ప్రయాణ వివరాలను సమర్పించటం తప్పనిసరి చేసింది యూఎస్.
అమెరికా వెళ్లాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఈ బాండ్ మొత్తం చెల్లించడం అనేది పెను భారంగా మారనుంది. బాండ్ కట్టినంత మాత్రాన వీసా వస్తుందన్న గ్యారెంటీ లేకపోవడం దరఖాస్తుదారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. వీసా గడువు ముగిసినా తిరిగి వెళ్లని వారి సంఖ్య పెరగకుండా అడ్డుకట్ట వేయడమే తమ లక్ష్యమని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే ఈ కఠిన నిబంధనల వల్ల అమెరికా వెళ్లే పర్యాటకులు, విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
