నిర్వాహకుల ఆహ్వానం మేరకే అర్యాన్ ఖాన్ వెళ్లారు

నిర్వాహకుల ఆహ్వానం మేరకే అర్యాన్ ఖాన్ వెళ్లారు
  • అర్యాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నాడని పరీక్షల్లో తేలలేదు
  • ఒకరోజు కస్టడీకి అప్పగించిన కోర్టు

ముంబయి: రేవ్ పార్టీలో పట్టుపడిన బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు అర్యాన్ ఖాన్ అరెస్టుపై కోర్టులో తీవ్ర వాదోపవాదలు జరిగాయి. హాలిడే కోర్టు అర్యాన్ ఖాన్ ను ఒకరోజు కస్టడీకి అప్పగించింది. ఎన్సీబీ అధికారులు అర్యాన్ ఖాన్ ను గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతోపాటు ఆయన మొబైల్ ఫోన్ తీసుకుని ఛాటింగ్.. కాల్స్ డీటెయిల్స్ పై సుదీర్ఘంగా విచారించారు. డ్రగ్స్ సేవించారనే అనుమానంతో వైద్య పరీక్షలు నిర్వహించగా ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని టెస్టుల్లో వెల్లడైనట్లు సమాచారం. 
నిషేధిత డ్రగ్స్ ను కొనడం, అమ్మడంతో పాటు వాటిని సేవించారనే ఆరోపణలతో నమోదు చేసిన ఈ  కేసులో అర్యాన్ ఖాన్ తోపాటు మరో ఇద్దరిని ఒక రోజు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.

కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా అర్యాన్ ఖాన్ తరపున లాయర్‌ సతీష్‌ మానేషిండే వాదించారు. అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఎన్‌సీబీ అధికారులకు అర్యాన్ ఖాన్ చెప్పిన విషయాలనే తాను కోర్టుకు తెలుపుతున్నానని ఆయన తెలిపారు. పెద్ద స్థాయిలోని వారు సాధారణంగా క్రూజ్‌లో పార్టీలు నిర్వహించేటపుడు వచ్చినవారిని ఎంటర్‌టైన్‌ చేయడానికి వీవీఐపీలను గెస్ట్ గా ఆహ్వానిస్తుంటారని, ఇదే క్రమంలోనే అర్యాన్ ఖాన్‌ను పిలిచారని లాయర్ షిండే వివరించారు. నిర్వాహకుల  ఆహ్వానం మేరకు వెళ్లారనేందుకు అర్యాన్ ఖాన్ ఎలాంటి చెల్లింపులు చేయలేదని.. అలాగే  డ్రగ్స్‌ తీసుకున్నాడని ఆరోపిస్తూ వైద్య పరీక్షలు చేయించగా.. అర్యాన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ సేవించినట్లు పరీక్షల్లో ఎక్కడా తేలలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

నిర్వాహకులు ఆహ్వానిస్తే వెళ్ళాడనేదుకు అతని వద్ద బోర్డింగ్‌ పాస్‌ కూడా లేని విషయాన్ని కోర్టుకు తెలియజేశారు. అర్యాన్ ఖాన్ వద్ద మొబైల్ ఫోన్ తీసుకుని విచారించిన  ఎన్‌సీబీ అధికారులకు ఏమీ దొరకలేదని తెలిపారు. వాదనల అనంతరం కోర్టు ఒక రోజు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది.