ఒకరి స్వేచ్ఛను హరించి మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా పిలవలేం

ఒకరి స్వేచ్ఛను హరించి మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా పిలవలేం

హైదరాబాద్: ఒకరి స్వేచ్ఛను హరించి మనల్ని మనది స్వేచ్ఛాయుత దేశమని చెప్పుకోలేమని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్ అన్నారు. బిల్కిస్ బానో కేసు దోషులను విడుదల చేయడంపై స్పందించిన ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దోషులను వదలిపెట్టడంపై స్మితా ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ బిల్కిస్ బానో కేసుకు సంబంధించిన వార్త చదువుతున్నప్పుడు ఒక మహిళగా, సివిల్ సర్వెంట్ గా చాలా బాధపడ్డా. ఇండియా ఓ స్వేచ్ఛా దేశం అంటే నమ్మబుద్ధి కాలేదు. బిల్కిస్ బానో స్వేచ్ఛను హరించి మనల్ని మనం స్వేచ్ఛయుత దేశంగా చెప్పుకోలేం ’’ అని స్మితా సభర్వాల్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరలైంది.

2002 గుజరాత్ అల్లర్ల  సమయంలో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష  అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. దీంతో పలు వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.  ఒక మహిళపై అత్యాచారం చేసి, ఆమె కుటుంబ సభ్యలను దారుణంగా చంపిన వ్యక్తులను నిర్దోషులుగా విడుదల చేయడం ఏంటనీ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఇదేనా అంటూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు విరుచుకుపడుతున్నారు.