కరోనా కేసులు పెరుగుతున్నయ్‌: అలర్ట్‌ కావాలంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ

కరోనా కేసులు పెరుగుతున్నయ్‌: అలర్ట్‌ కావాలంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కానీ కరోనా జాగ్రత్తలు పాటించే విషయంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ వైరస్ వ్యాప్తి మరింత పెరగకుండా కట్టడి చేసేందుకు ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకు మరోసారి లేఖలు రాసింది. నిర్లక్ష్యం వహించకుండా పాజిటివిటీ రేటు కంట్రోల్‌ చేయడంపై దృష్టి పెట్టాలని అలర్ట్ చేస్తూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖలు రాశారు. 

కరోనా రూల్స్ పాటించకుంటే కఠిన చర్యలు తీసుకోండి

దేశంలోని కొన్ని జిల్లాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం, పాజిటివిటీ రేటు అధికంగా ఉండడంపై అజయ్‌ భల్లా లేఖలో ప్రస్తావించారు. దీనిపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం అలర్ట్ కావాలని ఆయన సూచించారు. హై-పాజిటివిటీ రేటు ఉన్న చోట వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని, కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం చర్యలు చేపట్టాలని చెప్పారు. పండుగల సీజన్‌లో జనం సమూహాలుగా ఏర్పడకుండా చూడాలని, రద్దీ ప్రాంతాల్లో కరోనా కట్టడి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరారు. వైరస్ వ్యాప్తి పెరగకుండా ఐదంచెల వ్యూహాన్ని (టెస్ట్, -ట్రాక్, -ట్రీట్, -వ్యాక్సినేషన్, కరోనా జాగ్రత్తలు పాటించడం) అమలు చేయాలని అజయ్ భల్లా ఆదేశించారు. కరోనా ప్రొటోకాల్ అమలయ్యేలా స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రూల్స్ పాటించకుండా ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు సర్వైలెన్స్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. వ్యాక్సినేషన్‌లో దేశవ్యాప్తంగా చాలా పురోగతి ఉందని, అర్హులైన అందరికీ వ్యాక్సిన్ అందేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు టీకా కార్యక్రమాన్ని చేపట్టాలని అజయ్ భల్లా చెప్పారు.