రైతులకు విపక్ష పార్టీలు అబద్ధాలు చెబుతున్నాయి

రైతులకు విపక్ష పార్టీలు అబద్ధాలు చెబుతున్నాయి

న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులకు నిరసనగా శుక్రవారం దేశవ్యాప్త బంద్‌‌ నడుస్తోంది. బిల్లులపై నిరసనలు తెలుపుతూ రైతులు రైల్ రోకోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిల్లులపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ బిల్లుల విషయంలో రైతులకు విపక్ష పార్టీలు అబద్ధాలు చేస్తున్నాయని ఆరోపించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ బర్త్ యానివర్సరీలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. ‘బీజేపీ కార్యకర్తలు అందరూ గ్రౌండ్ లెవల్‌‌లో రైతుల వద్దకు వెళ్లి వారికి కొత్త వ్యవసాయ బిల్లుల ప్రాముఖ్యత గురించి చెప్పాలి. ఈ బిల్లులు వారికి ఎలా సాధికారతను తీసుకొస్తాయో వివరించాలి. తద్వారా దుష్ప్రచారాన్ని నిలువరించాలి. గత ప్రభుత్వాలు రైతులు, శ్రామికులకు అర్థం కాని విధంగా క్లిష్టమైన వాగ్దానాలు చేసేవి. కానీ బీజేపీ సర్కార్ ఈ పరిస్థితిని మార్చడానికి నిత్యం యత్నిస్తోంది. అందుకే రైతుల బాగు కోసం కొత్త వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టాం. కొత్త లేబర్ బిల్లులతో 30 శాతం వర్కర్స్‌‌కు కనీస వేతన హామీ దక్కింది. ఇది అవ్యవస్థీకృత రంగంలోని అందరు వర్కర్స్‌‌కు విస్తరించనుంది’ అని మోడీ పేర్కొన్నారు.