
అధికారంలోకి వస్తే మహిళలకు.. అందులోనూ 18 నిండిన ప్రతి మహిళలకు ప్రతినెలా 15 వందల రూపాయలు ఇస్తామని ఏపీలోని కూటమి పార్టీలు హామీ ఇచ్చిన విషయం తెలిసింది. ఈ మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రచారం చేయటంతోపాటు మేనిఫెస్టోలో కూడా ఈ పథకాన్ని స్పష్టం చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రభుత్వం.. ప్రతినెలా మహిళలకు 15 వందల రూపాయల పథకం ఇంకా అమలు చేయలేదు. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. ఓ సభలో చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి.
సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం అని.. అన్నింటినీ అమలు చేసినా.. ప్రతినెలా మహిళలకు 15 వందల రూపాయలు ఇవ్వాలంటే మాత్రం రాష్ట్రాన్ని అమ్మాలంటూ వ్యాఖ్యానించారు. ఆడవాళ్లకు నెలకు 15 వందల రూపాయలు ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్మాలి.. అంత డబ్బు అవసరం అవుతందని.. ఏం చేయాలి.. ఎలా చేయాలి.. ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి అనేది చంద్రబాబు ఆలోచిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు మంత్రి అచ్చెన్నాయుడు.
ఆ పథకం అమలు చేయాలంటే ఆంధ్రానే అమ్మేయాలి..! మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు#Atchannaidu #AndhraPradesh #APMinister pic.twitter.com/jbZdDahkBj
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) July 22, 2025
ALSO READ : ధన్కడ్ రాజీనామా వెనుక బలమైన కారణం ఉంది.. ! : ఎంపీ జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు...
బహిరంగ సభలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలతో.. ఈ పథకం అమలుపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే చంద్రబాబు P4 అనే స్కీం తీసుకొచ్చారు.. పేద కుటుంబాలను ధనవంతులు, కార్పొరేట్ కంపెనీలు దత్తత తీసుకుని వాళ్లను కోటీశ్వరులను చేయటం అన్నమాట.. దత్తత తీసుకున్న కంపెనీలు, ధనవంతులు ఆ కుటుంబాలను కోటీశ్వరులను చేయటం ద్వారా ప్రతి నెలా 15 వందల రూపాయల పథకం కూడా అందులోనే ఉంటుందనే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఇలాంటి సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీకి అవకాశంగా మారనుంది. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అమల్లోకి రాబోతోందని కూటమి సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. అయితే.. ఉచిత బస్సు పథకం అమలు కాకముందే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు పధకం ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ప్రకటించింది కూటమి. ఈమేరకు యాడ్స్ కూడా రిలీజ్ చేసింది. తీరా అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు పధకం జిల్లా పరిధిలోనే అమలవుతుందని ప్రకటించడం విమర్శలకు దారి తీసింది.