
- ఐటీ కారిడార్‌లో నయా ట్రావెలింగ్ కాన్సెప్ట్
- పొల్యూషన్, ట్రాఫిక్ జామ్ తగ్గించే దిశగా ప్రయత్నాలు
- సొంత వెహికల్స్ వాడకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో వెళ్తున్న వారిని గుర్తించి అవార్డులు
- మెట్రోతో కలిసి ఐటీ కంపెనీల గ్రీన్ మైల్స్ క్యాంపెయిన్
హైదరాబాద్, వెలుగు: పొల్యూషన్ తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఐటీ కారిడార్‌లో కొత్తగా గ్రీన్‌మైల్స్ క్యాంపెయిన్‌ను స్టార్ట్ చేశారు. సొంత వెహికల్స్ వాడకంతో ట్రాఫిక్ జామ్, పొల్యూషన్ పెరుగుతుండటంతో.. ఈ సమస్యను తగ్గించి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను ఉపయోగించేలా ఐటీ కంపెనీలు ఎంప్లాయీస్‌ను ప్రోత్సహిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోతో కలిసి ఐటీ కంపెనీలు ఈ గ్రీన్ మైల్స్ క్యాంపెయిన్‌ను మొదలుపెట్టాయి. మెట్రో, ఆర్టీసీ బస్సులు, కార్ పూలింగ్(ఒకే వెహికల్లో ఆఫీసుకు వెళ్లడం), బైక్ పూలింగ్‌లో వచ్చే ఎంప్లాయీస్‌ను గుర్తించి వారికి అవార్డులు, బ్యాడ్జీలు అందించి ఎంకరేజ్ చేస్తున్నాయి.
లక్షల సంఖ్యలో వెహికల్స్..
లాక్డౌన్ తర్వాత సొంత వెహికల్స్ వాడకం పెరగడంతో సిటీలో రోడ్లన్నీ నిండిపోతున్నాయి. ఐటీ కారిడార్‌లో చాలా వరకు కంపెనీలు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం, కొన్ని హైబ్రిడ్ మోడల్ నడుస్తుండటంతో ఎంప్లాయీస్ అంతా ఆఫీసులకు హాజరవుతున్నారు. వీరిలో చాలా మంది సొంత వెహికల్స్‌లోనే వస్తుండగా.. ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రంగా మారింది. దీంతో హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్ పరిసర ప్రాంతాలు ఐటీ కంపెనీలకు వెళ్లే వారి బైక్‌లు, కార్లతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఇలా లక్షల సంఖ్యలో వెహికల్స్రోడ్ల మీదకు వస్తుండటంతో పొల్యూషన్ కూడా పెరుగుతోంది. దీన్ని తగ్గించి ఎంప్లాయీస్లో గ్రీన్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను పెంపొందించేందుకు ఇటీవల కొంతకాలంగా ఐటీ కంపెనీలు పర్యావరణ రహిత ప్రయాణాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
గ్రీన్ మైల్స్ పేరుతో..
ట్రాఫిక్ జామ్‌లతో అవస్థలు పడే కంటే మెట్రోలో జర్నీ ఈజీగా భావిస్తున్న చాలామంది ఎంప్లాయీస్ అందులోనే వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సొంత వెహికల్స్ వాడకాన్ని తగ్గించి మెట్రోతోపాటు ఇతర షేరింగ్ విధానాల్లో ఆఫీసుకు వచ్చేలా ఐటీ కంపెనీలు సైతం తమ ఎంప్లాయీస్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్ మెట్రోతో కలిసి గ్రీన్ మైల్స్ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నాయి. ‘ట్రావెల్ మోర్-.. విన్ మోర్’ అనే కాన్సెప్ట్‌తో మెట్రో, ఆర్టీసీ, షేరింగ్ వెహికల్స్ లో ట్రావెల్ చేసేలా ఎంకరేజ్ చేస్తున్నాయి. అలా వచ్చి, వెళ్లే ఎంప్లాయీస్‌ను గుర్తిస్తూ కంపెనీల్లోనే వారికి గిఫ్ట్‌లు, అవార్డులు అందజేస్తున్నారు. గత నెలలో ప్రారంభించిన ఈ అవార్డుల కార్యక్రమాన్ని వారంలో ఒకరోజు నిర్వహిస్తున్నారు.
కిటకిటలాడుతున్న మెట్రో..
లాక్డౌన్ తర్వాత నుంచి క్రమక్రమంగా మెట్రోలో జర్నీ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో అన్ని మెట్రో స్టేషన్లు ప్యాసింజర్లతో కిటకిటలాడుతున్నాయి. మెట్రో ట్రైన్లలో తీవ్ర రద్దీ కనిపిస్తోంది. ప్రస్తుతం మెట్రోలో రోజుకి 4 లక్షల మందికి పైగానే ప్రయాణిస్తున్నారు. గ్రీన్ మైల్స్‌ను ప్రారంభించడంతో మెట్రోలో ప్యాసింజర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యం
లోనే మెట్రో ట్రైన్ల ప్రీక్వెన్సీని పెంచాలని ఐటీ ఎంప్లాయీస్ కోరుతున్నారు.
ట్రాఫిక్ కంట్రోలింగ్ దిశగా..
ప్రస్తుతం ట్రాఫిక్ విపరీతంగా ఉంటోంది. అంతా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తుండటంతో ఐటీ కారిడార్‌లో పీక్ అవర్స్‌లో రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి. ఈ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసి ఎంప్లాయీస్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉపయోగించే దిశగా గ్రీన్ మైల్స్ ఇన్నోవేషన్‌ను ప్రారంభించాం. ఇది ట్రాఫిక్ కంట్రోలింగ్ కి ఉపయోగపడనుంది. ఇప్పటికే ఎంతోమంది ఐటీ ఎంప్లాయీస్ మెట్రో లాంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను వాడుతున్నారు. మరింతమంది ఉపయోగించే విధంగా ఈ కాన్సెప్ట్ ఉపయోగపడనుంది.
‑ సత్యనారాయణ, తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు
మెట్రో ట్రైన్ల ఫ్రీక్వెన్సీని పెంచాలి
రెండేళ్లుగా మాదాపూర్‌లోని ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నా. నా వెహికల్లో డైలీ ఆఫీసు వెళ్లేవాణ్ని. ఆఫీస్‌కు వెళ్లేందుకు, అక్కడి నుంచి మళ్లీ ఇంటికి రావడానికి చాలా టైమ్ పట్టేది. అందుకే మెట్రో ట్రావెలింగ్ కార్డ్ తీసుకున్నా. ప్రస్తుతం మెట్రోలోనూ ఫుల్ రష్ ఉంటోంది. మెట్రో ట్రైన్ల ఫ్రీక్వెన్సీ పెంచి, లాస్ట్ మైల్ కనెక్టివిటీని సరిగా మెయింటెన్ చేస్తే బాగుంటుంది.
‑ లక్ష్మణ్, సికింద్రాబాద్