
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ కాల్పుల విరమణ అవగాహనపై భారత్-పాక్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. 2025, మే 10న ఇరు దేశాల డీజీఎంవోల మధ్య కుదిరిన సీజ్ ఫైర్ అవగాహనను యధావిధిగా కంటిన్యూ చేసేందుకు పాక్, భారత్ ఒకే చెప్పాయి. భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించే చర్యలను కొనసాగించాలని ఇరు దేశాల డీజీఎంవోల చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. టెన్షన్ వాతావరణాన్ని తగ్గించి సాధారణ పరిస్థితి తీసుకువచ్చే చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
కాగా, పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్, పీవోకేలోని ఉగ్రవాదుల స్థావరాలపై మిసైళ్లు, బాంబుల వర్షం కురిపించింది. భారత మెరుపు దాడుల్లో దాదాపు 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా పాక్ భారత్‌పై దాడులకు తీవ్రంగా ప్రయత్నించింది.
ALSO READ | POK, టెర్రరిజంపైనే చర్చలు.. అంతకుమించి పాక్‌తో ఒక్క మాట మాట్లాడేదే లే: జైశంకర్
పాక్ దాడులను భారత్ ఎక్కడికక్కడ తిప్పి కొట్టడంతో పాటు దాయాది దేశంపై విరుచుకుపడింది. పాక్, భారత్ మధ్య నెలకొన్న ఘర్షణ యుద్ధానికి దారి తీస్తోన్న నేపథ్యంలో ఇరు దేశాలు కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ మేరకు 2025, మే 10న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) హాట్ లైన్ ద్వారా చర్చలు జరిపి సీజ్ ఫైర్ అవగాహన ఒప్పందం చేసుకున్నారు.
దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. ఈ క్రమంలో గురువారం (మే 15) ఇరు దేశాల డీజీఎంలో మరోసారి చర్చలు జరిపి.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని యధావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాయి. అన్ని సరిహద్దు సైనిక చర్యలపై విరామం పొడిగించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.