IPL నుంచి మయాంక్ ఔట్.. మరో యంగ్ స్పీడ్‎గన్‎ను వెతికి పట్టుకొచ్చిన లక్నో

IPL నుంచి మయాంక్ ఔట్.. మరో యంగ్ స్పీడ్‎గన్‎ను వెతికి పట్టుకొచ్చిన లక్నో

లక్నో: ప్లే ఆఫ్స్ వేళ లక్నో సూపర్ జైయింట్స్‎కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్పీడ్‎గన్, యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా మయాంక్ ఐపీఎల్‎ నుంచి వైదొలిగాడు. 2025 సీజన్ కోసం మయాంక్ యాదవ్‎ను లక్నో రూ.11 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. వెన్ను గాయం కారణంగా ఈ స్టార్ పేసర్ ఐపీఎల్ తొలి అర్ధభాగం ఆడలేకపోయాడు. 

గాయం నయం కావడంతో తిరిగి వచ్చి రెండు మ్యాచులు ఆడాడు. మళ్లీ గాయం తిరగబెట్టడంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో మయాంక్ స్థానంలో లక్నో మరో యంగ్ పేసర్‎ను వెతికి పట్టుకొచ్చింది. 24 ఏళ్ల న్యూజిలాండ్ యంగ్ పేసర్ విలియం పీటర్ ఓ'రూర్క్‎ను మయాంక్ స్థానంలో భర్తీ చేసింది. ఈ మేరకు రూ.3 కోట్లతో రూర్క్‎తో  లక్నో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 

మరోవైపు, పంజాబ్ కూడా జట్టులో ఓ కీలక మార్పు చేసింది. గాయపడిన లాకీ ఫెర్గూసన్ స్థానంలో న్యూజిలాండ్ పేసర్ కైల్ జామిసన్‌ను జట్టులోకి తీసుకుంది. ఫెర్గూసన్ తొడ కండరాల గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దీంతో ఫెర్గూసన్ స్థానంలో మిగిలిన సీజన్ కోసం రూ.2 కోట్లతో జామిసన్‎తో పంజాబ్ ఒప్పందం కుదుర్చుకుంది. జామిసన్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో క్వెట్టా గ్లాడియేటర్స్‌లో తరుఫున ఆడుతున్నాడు. 

కాగా, భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య పరిస్థితులు సద్దుమణిగా శాంతి వాతావరణం నెలకొంటుండంతో మే 17 నుంచి ఐపీఎల్ పునః ప్రారంభం కానుంది. మిగిలిన ఐపీఎల్ మ్యాచులు బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, ముంబయి, లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ మొత్తం ఆరు వేదికల్లో జరగనున్నాయి. మే 29 క్వాలిఫయర్ 1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ నిర్వహించనున్నారు.