ఈడీ రిమాండ్​ రిపోర్టు : 9 నెలల్లో 10 ఫోన్లు మార్చిన ఎమ్మెల్సీ కవిత 

ఈడీ రిమాండ్​ రిపోర్టు  : 9 నెలల్లో 10 ఫోన్లు మార్చిన ఎమ్మెల్సీ కవిత 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లు మీడియా ప్రచారం.. తప్ప అధికారికంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమె పేరును ప్రకటించలేదు. కానీ మొదటిసారిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తావించారు. ఇవాళ (బుధవారం) ఉదయం అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు కూడా ఉంది.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 36 మంది నిందితులు/అనుమానితులు ఉన్నారని అమిత్​ అరోరా రిమాండ్​ రిపోర్టులో ఈడీ పేర్కొంది. వారందరూ దాదాపు 170 ఫోన్లను వినియోగించారని.. అయితే వాటిలో కేవలం 17 ఫోన్లే తమకు దొరికాయని ఈడీ తెలిపింది.  అమిత్​ అరోరా వాడిన 11 ఫోన్లను, ఎమ్మెల్సీ కవిత వాడిన 10 ఫోన్లను ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని పేర్కొంది. 2021 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు (9 నెలల్లో ) కవిత 10 ఫోన్లు మార్చారని ఈడీ తెలిపింది. ఆ 10 ఫోన్ల IMEI నెంబర్లను అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది.

అమిత్ అరోరా ఫోన్ కాల్ డేటాలో కవిత నెంబర్

అమిత్ అరోరా ఫోన్ కాల్ డేటాలో కవిత ఫోన్ నెంబర్ ఉందని.. ఆయనతో ఎమ్మెల్సీ కవిత పలు సార్లు మాట్లాడారని రిమాండ్​ రిపోర్టులో పొందుపరిచారు. అమిత్ అరోరా తన ఫోన్ నుంచి కవితకు 10 సార్లు కాల్ చేసినట్లు ఈడీ పేర్కొంది. లిక్కర్ స్కాం బయటికి వచ్చినప్పటి నుంచి ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారని..అందులో భాగంగానే ఫోన్లు మార్చారని ఈడీ అధికారులు చెప్పారు.  ఈ కేసులో ధ్వంసమైన  153 ఫోన్ల విలువ దాదాపు రూ.1.38 కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేసింది.  

విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు

ఇవాళ (బుధవారం) అమిత్ అరోరాను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగానే రిపోర్టు దాఖలు చేయగా..  అందులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లు ఉన్నట్లు తెలిసింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పార్టీకి కమీషన్ల కోసమే ఢిల్లీ లిక్కర్ పాలసీలో హోల్​ సేల్​ మద్యం వ్యాపారులకు అత్యధికంగా మార్జిన్ పెట్టారని ఈడీ ఆరోపించింది. 5శాతం ఉన్న మార్జిన్ ను ఏకంగా 12శాతానికి పెంచి, అందులో 6 శాతం మార్జిన్ ను  కమీషన్ల రూపంలో ఆప్ పార్టీకి ముడుపులు అందేలా లిక్కర్ స్కాం తయారు చేశారని రిమాండ్​ రిపోర్టులో పేర్కొన్నారు. ఆప్ ముఖ్య నాయకుల తరఫున విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు అందాయని, సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, శరత్ రెడ్డి ఉన్నారని ఈడీ ఇవాళ విడుదల చేసిన అమిత్ అరోరా రిమాండ్​ రిపోర్టులో వెల్లడించింది.