హైకోర్టు తీర్పు ప్ర‌కారం ఎస్ఈసీగా నిమ్మ‌గ‌డ్డ నియామ‌కం కూడా చెల్ల‌దు

హైకోర్టు తీర్పు ప్ర‌కారం ఎస్ఈసీగా నిమ్మ‌గ‌డ్డ నియామ‌కం కూడా చెల్ల‌దు

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నియామ‌కానికి సంబంధించి కేసులో హైకోర్టు తీర్పులో ఎక్క‌డా నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ త‌నంత‌ట తానుగా ఎస్ఈసీగా చార్జ్ తీసుకోవ‌చ్చ‌ని లేదన్నారు ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్. ధ‌ర్మాస‌నం తీర్పు ప్ర‌కారం ఆయ‌న నియామ‌కం కూడా చెల్ల‌ద‌న్నారు. హైకోర్టు తీర్పుపై ఏజీ శ‌నివారం మీడియాతో మాట్లాడారు. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ను నియ‌మించ‌డానికి సంబంధించిన నిబంధ‌న‌ల‌పై గ‌వ‌ర్న‌ర్ కు సిఫార‌సు చేసే అధికారం రాష్ట్ర మంత్రి మండ‌లికి లేద‌ని కోర్టు చెప్పింద‌ని అన్నారు. అయితే నిమ్మ‌గ‌డ్డ నియామ‌కాన్ని కూడా నాటి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ కు సిఫార‌సు చేయ‌డం ద్వారానే జ‌రిగింద‌న్నారు. జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్ నియామ‌కం కూడా అదే త‌ర‌హాలో జ‌రిగింద‌ని, ఈ నేప‌థ్యంలో రెండు నియామ‌కాలు కూడా చెల్ల‌వ‌ని అన్నారు ఏజీ శ్రీరామ్. అయితే నిన్న‌నే నిమ్మగడ్డ రమేశ్ తాను ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా తిరిగి బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ట్లుగా ప్ర‌క‌టించుకున్నార‌ని, ఆ వెంట‌నే విజ‌య‌వాడ ఆఫీసు నుంచి హైద‌రాబాద్ లోని త‌న ఇంటికి వాహ‌నాలు పంపాల‌ని స‌ర్క్యుల‌ర్ కూడా ఇచ్చేశార‌న్నారు. ఎస్ఈసీగా కొనసాగమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు నేరుగా ఎక్కడా చెప్పలేదన్నారు. ఆయ‌న్ని తిరిగి కొన‌సాగించాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి సూచించింద‌ని, అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం ఎస్ఈసీ నియామకానికి అధికారం లేద‌న్నప్పుడు ఎలా చేయాల‌న్న దానిపై సందిగ్ధ‌త నెల‌కొంద‌ని, దీనిపై క్లారిటీ కోసం సుప్రీం కోర్టుకు వెళ్తున్నామని అ‌న్నారు ఏజీ. అప్ప‌టి వ‌ర‌కు తీర్పుపై స్టే ఇవ్వాల‌ని హైకోర్టులో పిటిష‌న్ వేశామ‌న్నారు.

మ‌రోవైపు హైకోర్టు తీర్పు అమ‌లుకు కాలవ్యవధి స్పష్టంగా చెప్పకుంటే.. రెండు నెలల కాలవ్యవధి ఉంటుందని ఏజీ శ్రీరామ్ చెప్పారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదని, కానీ ఆయ‌న బాధ్య‌త‌లు తీసుకున్న‌ట్లుగా చెబుతూ ఎస్ఈసీ స్టాండింగ్ కౌన్సిల్ గా ఉన్న ప్రభాకర్ ను ఆదివారంలోగా రాజీనామా చేయమని నిమ్మగడ్డ ఆదేశించారని, ఆయ‌న‌కు ఆ హ‌క్కు లేద‌ని వివ‌రించారు. సాధారణంగా ప్రభుత్వ న్యాయనిపుణులు ఎప్పుడూ మీడియా ముందుకు రారని, అయితే కానీ ఇది రాజ్యాంగ అంశాలు, హైకోర్టు తీర్పుతో కూడినందున క్లారిటీ ఇచ్చేందుకు మీడియా స‌మావేశం పెట్టాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు.