జీపీలకు ఫర్నీచర్ అందజేసిన వ్యాపారవేత్త : తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి

జీపీలకు ఫర్నీచర్ అందజేసిన వ్యాపారవేత్త : తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి
  • పంపిణీ ప్రారంభించిన తిమ్మయ్యగారి సుభాష్​రెడ్డి

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి నియోజకవర్గంలోని 50 గ్రామపంచాయతీలకు బీబీపేట మండలం జనగామకు చెందిన వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్​రెడ్డి  ఫర్నీచర్​ అందించారు.  ఒక్కో పంచాయతీకి రూ.2 లక్షల విలువైన  ఫర్నీచర్​ను అందిస్తుండగా, మొదటి విడతలో 50 జీపీలకు గురువారం జనగామలో  నిర్వహించిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పంచాయతీ ద్వారా మెరుగైన పాలన అందించేందుకు అనువైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఫర్నీచర్​ అందిస్తున్నట్లు తెలిపారు.

సర్పంచులు, పాలక వర్గ సభ్యులు కలిసి కట్టుగా గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని కోరారు. తాను చదువుకున్న స్కూల్​ బిల్డింగ్​ను రూ.7 కోట్లతో నిర్మించటంతో పాటు మరో 2 గ్రామాల్లో స్కూల్స్​ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గవర్నమెంట్  స్కూళ్లలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్య  అందేలా చూడడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు తాను ప్రయారిటీ ఇస్తానని చెప్పారు.

తాను స్కూల్​ బిల్డింగ్​ నిర్మించడంతో తెలంగాణలో అప్పటి ప్రభుత్వం ‘మన ఊరు, మన బడి’,  ఏపీలో  నాడు, -నేడు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. తాను కష్టపడి ఎదిగానని, తన సంపాదనలో కొంత సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నానని తెలిపారు.