ఉమ్మడి ఖమ్మం జిల్లా అభ్యర్థులకు సీఎం కేసీఆర్​ ఫోన్

ఉమ్మడి ఖమ్మం జిల్లా అభ్యర్థులకు సీఎం కేసీఆర్​ ఫోన్
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభ్యర్థులకు సీఎం కేసీఆర్​ ఫోన్లు 
  •     నియోజకవర్గాల ఇన్​చార్జీలతో సమావేశం కాకపోవడంపై సీరియస్​ 
  •   ఇతర నేతలతో సమన్వయం చేసుకోవాలని సూచన  
  •      సర్వే రిపోర్టులు, గెలుపు అవకాశాలపై ధీమా 
  •     స్కీముల్లో వ్యతిరేకత తగ్గించుకోవాలని ఆదేశాలు

ఖమ్మం, వెలుగు:  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్​ప్రత్యేక నజర్ పెట్టారు. గత రెండు ఎన్నికల్లో జరిగిన అనుభవాలను గుర్తు పెట్టుకొని, ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్లాన్లు వేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ గుర్తుపై ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యే మాత్రమే గెలవడంతో దాన్ని ఎలాగైనా మార్చాలని ఎత్తులు వేస్తున్నారు.

ఇప్పటికే టికెట్లను ప్రకటించి దాదాపు 50 రోజులు కావడంతో, అభ్యర్థులకు ఫోన్లు చేసి నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బీఆర్ఎస్​తరపున పోటీ చేస్తున్న ఐదారుగురు అభ్యర్థులకు ఇటీవల స్వయంగా కేసీఆర్ ఫోన్​ చేసి మాట్లాడారు. నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితుల గురించి వారితో మాట్లాడారు. ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి నేతల పరిస్థితితో పాటు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలపైనా చర్చించినట్టు సమాచారం. స్కీముల అమల్లో వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవాలని, జిల్లాలోని ఇతర నేతలతో సమన్వయం చేసుకోవాలని కేసీఆర్​సూచించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఈసారి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని, అలాగని అలసత్వం వహించకుండా అలర్ట్ గా ఉండాలని ఆదేశించినట్టు సమాచారం. 

ఆ విషయంలో సీరియస్​

ఆగస్టు 21న బీఆర్ఎస్​ టికెట్ల జాబితాను ప్రకటించగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాల వారీగా అభ్యర్థులు, ఆయా నియోజకవర్గాల ఇన్​చార్జీలు కలిసి సమావేశం కాకపోవడంపై కేసీఆర్​కాస్త సీరియస్​అయినట్టు తెలుస్తోంది. అభ్యర్థులతో పాటు పార్టీలో ముఖ్య నేతలంతా సఖ్యతగా ఉన్నామనే సంకేతాలను కేడర్​కు పంపించాలని, వారిలో కాన్ఫిడెన్స్​ నింపేందుకు చర్యలు తీసుకోవాలని అభ్యర్థులకు సూచించినట్టు సమాచారం.

ALSO READ  :- కాంగ్రెస్ లిస్టు ఇంకింత లేటు.. బస్సు యాత్ర తర్వాత ప్రకటించే చాన్స్

గత మూడు నెలల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడి కాంగ్రెస్​లో చేరినా, వారి ప్రభావం పెద్దగా ఉండదనే విషయం తన సర్వేల్లో తేలిందని కేసీఆర్​ చెప్పినట్టు తెలుస్తోంది. అన్ని చోట్ల నుంచి మూడు రకాలుగా తాను సమాచారం తెప్పించుకుంటున్నానని, గెలుపుపై ధీమాగా ఉండాలని కేసీఆర్​ కామెంట్ చేసినట్టు టాక్​ నడుస్తోంది. 

బాలసానికి బుజ్జగింపులు..! 

ఇటీవల పార్టీ వ్యవహారాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఇంటికి ఆదివారం మంత్రి పువ్వాడ అజయ్​వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. భద్రాచలం ఇన్​చార్జీగా ఉన్న ఆయనకు తెలియకుండా తెల్లం వెంకట్రావును తిరిగి పార్టీలోకి తీసుకోవడం, వెంటనే ఇన్​చార్జీ పదవిని కూడా తప్పించడంపై బాలసాని అసంతృప్తితో ఉన్నారు.

దీంతో ఖమ్మం బ్యాంక్​ కాలనీలో ఉన్న బాలసాని లక్ష్మీనారాయణ ఇంటికి అజయ్​వెళ్లి సంప్రదింపులు జరిపారు. అక్కడి నుంచే హరీశ్​రావుకు ఫోన్​ చేసి మాట్లాడించగా, పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది. మిగిలిన విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పినట్టు సమాచారం. అయితే, తన 30 ఏండ్ల  రాజకీయ జీవితంలో ఇంతటి అవమానకర పరిస్థితులను ఎప్పుడూ ఎదుర్కోలేదని, కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని బాలసాని ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు మారుతున్న రాజకీయ పరిణామాల్లో బాలసాని పార్టీ మారకుండా ఉండేందుకు ముందుగానే బీఆర్ఎస్​ రంగంలోకి దిగిందా అనే చర్చ మొదలైంది. బీసీ సామాజికవర్గానికి చెందిన బాలసానిని కాంగ్రెస్​లోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, జనరల్ సీటు నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తామంటూ ఆఫర్ కూడా ఇచ్చిందని సమాచారం. దీంతో ఆయన్ను పార్టీ మారకుండా చూసేందుకు బుజ్జగింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది.