కాంగ్రెస్ లిస్టు ఇంకింత లేటు.. బస్సు యాత్ర తర్వాత ప్రకటించే చాన్స్

కాంగ్రెస్ లిస్టు ఇంకింత లేటు..  బస్సు యాత్ర తర్వాత ప్రకటించే చాన్స్
  • కాంగ్రెస్ లిస్టు ఇంకింత లేటు
  • బస్సు యాత్ర తర్వాత ప్రకటించే చాన్స్
  • అభ్యర్థుల ఎంపిక విషయంలో తర్జనభర్జనలు
  • స్క్రీనింగ్ కమిటీ భేటీలో భిన్నాభిప్రాయాలు
  • కొన్ని సీట్ల విషయంలో స్పష్టత వస్తలే
  • లిస్టు లేటవుతుండటంతో బస్సు యాత్రకు పార్టీ ప్లాన్
  • 15న ఆదిలాబాద్ నుంచి ప్రారంభించనున్న ప్రియాంక
  • 18, 19, 20వ తేదీల్లో యాత్రలో పాల్గొననున్న రాహుల్

హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు : అభ్యర్థుల జాబితా విషయంలో కాంగ్రెస్ పార్టీ తర్జనభర్జనలు పడుతున్నది. తుది జాబితా విషయంలో ఓ స్పష్టతకు రాలేకపోతున్నది. పలు వర్గాల నుంచి డిమాండ్లు పెరిగిపోతుండటం, పార్టీ స్క్రీనింగ్ కమిటీలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జాబితా ప్రకటన మరింత ఆలస్యం అవుతున్నది. ఈ నేపథ్యంలో ముందుగా ఢిల్లీ ముఖ్య నేతలతో బస్సు యాత్రను చేపట్టి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ భావిస్తున్నది.

యాత్ర పూర్తయ్యాకే టికెట్లను ప్రకటించాలని యోచిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తున్నది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఖర్గే తదితర నేతలను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. బస్సు యాత్ర పూర్తయిన తర్వాత లేదా అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత జాబితాను ప్రకటించాలని భావిస్తున్నది.

సోనియాతో ముగింపు సభ?

ఈ నెల 15వ తేదీన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను ప్రారంభించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆదిలాబాద్ నుంచి ఈ యాత్రను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ప్రారంభిస్తారని తెలుస్తున్నది. 16న నిజామాబాద్‌‌లో జరిగే యాత్రలోనూ ఆమె పాల్గొంటారని సమాచారం. 18,19, 20 వ తేదీల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారని నేతలు చెప్తున్నారు. రాహుల్ యాత్రలన్నీ ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో సాగుతాయని అంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కూడా ఇందులో భాగం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

బస్సు యాత్రలో భాగంగా గ్రామాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌‌లను నిర్వహించనున్నట్టు సమాచారం. చివర్లో ముగింపు సభను సోనియా గాంధీతో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మంగళవారం నిర్వహించనున్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ)లో వీటన్నింటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొంటున్నాయి. యాత్రను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఎక్కడ ముగించాలి? అనే దానిపై ఆ సమావేశంలోనే స్పష్టత వస్తుందని చెప్తున్నారు.

అభ్యర్థులపై కుదరని ఏకాభిప్రాయం

ఆదివారం ఢిల్లీలోని జీఆర్జీ రోడ్డులో ‘కాంగ్రెస్ వార్ రూం’లో నాలుగో సారి స్ర్కీనింగ్ కమిటీ భేటీ అయింది. కమిటీ చైర్మన్ మురళీధరన్, బాబా సిద్ధిఖీ, జిగ్నేశ్​ మేవానీ, కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ భేటీ సాగింది. 70 స్థానాలపై క్లారిటీ రాగా.. మిగిలిన సీట్ల విషయంలో అదే కన్ఫ్యూజన్ కొనసాగింది. ఈ సీట్లకు క్యాండిడేట్లను ఫైనల్ చేయడంలో ఏకాభిప్రాయం కుదరలేదు. కమిటీలోని సభ్యులు ఎవరికి వారే తాము ప్రతిపాదించిన క్యాండిడేట్ కే విజయ అవకాశాలు ఉన్నాయంటూ వాదించారు. దీంతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

చేరికలు, ఇతర పరిస్థితులు ఉన్న దాదాపు 10 స్థానాలపై అసలు చర్చనే జరగలేదని కమిటీ సభ్యుల ద్వారా తెలిసింది. దీంతో ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు రాష్ట్ర నేతలతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ వన్ టు వన్ నిర్వహించారు. వివాదాస్పదంగా, భిన్న అభిప్రాయాలు ఉన్న స్థానాలపై అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ అభిప్రాయాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి... త్వరలో మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ కావాలని నిర్ణయించారు.

పార్టీ సీఈసీదే తుది నిర్ణయం: మాణిక్ ఠాక్రే

టికెట్ల ఖరారు విషయంలో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ)దే తుది నిర్ణయమని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే స్పష్టం చేశారు. స్ర్కీనింగ్ కమిటీ ఇచ్చే పేర్లు కేవలం ప్రపోజల్ మాత్రమే అని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్‌‌ను కుటుంబం నడిపిస్తున్నది. వాళ్లు ఎవరికి సీట్లు ఇవ్వాలంటే వారికి అనౌన్స్ చేయొచ్చు. కానీ కాంగ్రెస్ నేషనల్ పార్టీ. స్ర్కీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అంటూ విధానాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తాం” అని తెలిపారు. 

వారంలోగా జాబితా : కోమటి రెడ్డి వెంకట్‌‌రెడ్డి

వారం రోజుల్లో కాంగ్రెస్ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఎంపీ, స్క్రీనింగ్ కమిటీ మెంబర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. స్క్రీనింగ్ కమిటీలో అన్ని స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందన్నారు. సీఈసీ నిర్ణయం మేరకు అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని చెప్పారు. రెండు రోజుల్లో సెంట్రల్ ఎలెక్షన్ కమిటీ సమావేశం ఉండే అవకాశం ఉందని తెలిపారు.

సభలన్నీ డీకే ఆధ్వర్యంలోనే!

రాష్ట్రంలో కాంగ్రెస్ పెద్దలు నిర్వహించే సభలన్నింటినీ కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమారే దగ్గరుండి పర్యవేక్షిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నెల రోజుల యాక్షన్‌‌ ప్లాన్‌‌ను రాష్ట్రంలో డీకే శివకుమార్​ చేపట్టనున్నట్టు తెలుస్తున్నది. ఆ 30 రోజుల పాటు ఆయన హైదరాబాద్‌‌లోనే ఉండి అన్ని విషయాలను చూసుకోనున్నట్టు సమాచారం. అసంతృప్తులతో చర్చలు జరిపి, పార్టీకి నష్టం జరగకుండా చర్యలు తీసుకునే బాధ్యతనూ ఆయనకే అప్పజెప్పినట్టు తెలిసింది. ప్రియాంక, రాహుల్ గాంధీ పర్యటించే సభలన్నింటికీ డీకే ఆధ్వర్యంలోనే కసరత్తులు జరుగుతాయని అంటున్నారు.

రేవంత్ వర్సెస్  వెంకట్‌‌ రెడ్డి, ఉత్తమ్

అభ్యర్థుల ఎంపిక విషయంలో పీసీసీ చీఫ్ రేవంత్​ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య వివాదం రేగిందని తెలుస్తున్నది. ఢిల్లీలో జరిగిన తొలి రెండు స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో 25 మందితో పెట్టిన లిస్టులో రేవంత్​ రెడ్డి పలు మార్పులను చేసినట్టు సమాచారం. అందులో కొందరు సీనియర్ల పేర్లను తీసేసి, వేరే లీడర్ల పేర్లను పెట్టారని కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఫైనల్ చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపిన లిస్టులో మార్పులు చేయడం మంచిది కాదని ఆయన అన్నట్టు తెలుస్తున్నది. దీంతో పీసీసీ చీఫ్​గా ఎవరి పేర్లను ప్రతిపాదిస్తే బాగుంటుందో తనకు తెలుసని రేవంత్ బదులిచ్చినట్లు సమాచారం.

ALSO READ  :- కాజీపేట వరకు పూణె-హైదరాబాద్ స్పెషల్ రైలు

స్క్రీనింగ్ కమిటీలోని మిగతా సభ్యులు కోమటిరెడ్డికి అనుకూలంగా మాట్లాడినట్టు తెలిసింది. దీంతో ఇద్దరు నేతల మధ్య సవాళ్ల వరకు పరిస్థితులు వెళ్లాయంటున్నారు. రాహుల్ వద్దే తేల్చుకుందామంటూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారని తెలుస్తున్నది. మరో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్‌‌తో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. 35 మంది అభ్యర్థుల విషయంలో రేవంత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఈ విషయంలో కమిటీ చైర్మన్ మురళీధరన్​తో పాటు మిగతా కమిటీ సభ్యులు కూడా రేవంత్ తీరును ఆక్షేపించినట్టు తెలుస్తున్నది.

పార్టీ సీఈసీదే తుది నిర్ణయం

టికెట్ల ఖరారు విషయంలో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ)దే తుది నిర్ణయం. స్ర్కీనింగ్ కమిటీ ఇచ్చే పేర్లు కేవలం ప్రపోజల్ మాత్రమే. సాధ్యమైనంత త్వరగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నం. బీఆర్ఎస్‌ను కుటుంబం నడిపిస్తున్నది. వాళ్లు ఎవరికి సీట్లు ఇవ్వాలంటే వారికి అనౌన్స్ చేయొచ్చు. కానీ కాంగ్రెస్ నేషనల్ పార్టీ. స్ర్కీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అంటూ విధానాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తం.

- మాణిక్ రావ్ ఠాక్రే, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్