సరూర్ నగర్ చెరువు గేట్లు ఎత్తివేతతో నీటమునిగిన కాలనీలు

సరూర్ నగర్ చెరువు గేట్లు ఎత్తివేతతో నీటమునిగిన కాలనీలు

హైదరాబాద్ : గత రెండు మూడు, రోజులుగా కురిసిన వర్షాలకు సరూర్ నగర్ చెరువుకు భారీగా వరదనీరు చేరుకుంది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు 6 గేట్లు ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా చెరువు కింద ఉన్న దిగువ కాలనీలు నీట మునిగాయి. 6 గేట్లు ఓపెన్ చేయడంతో కోదండరాం నగర్, వీవీ నగర్, కమలానగర్ కాలనీల్లో ఉన్న నాళాలు పొంగిపొర్లుతూ.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. చెరువులోని మురుగునీటిని కాలనీల్లోకి వదలడం ఏంటని ఇరిగేషన్ శాఖ అధికారుల తీరును స్థానిక గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తప్పుపట్టారు. 

ఎమ్మెల్యే ఆదేశాలతో గేట్లు ఎత్తడం ఏంటి..?

గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామ రంగారెడ్డితో కలిసి నీట మునిగిన కాలనీల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించి.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెరువు గేట్లను కూడా పరిశీలించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ కార్యకర్తలు చెరువు గేట్లు ఓపెన్ చేయడం ఏంటని కార్పొరేటర్ ప్రేమ్ మాహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

SNDP పనులు పూర్తి చేయకుండానే.. 90 శాతం పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రచారం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఒకవేళ SNDP పనులు పూర్తైతే ఓవర్ ఫ్లో కారణంగా చెరువు కింద ఉన్న కాలనీలు ఎందుకు మునిగిపోతాయని ప్రశ్నించారు. అనధికారికంగా గేట్లు ఎత్తిన వారిపై కేసులు నమోదు చేయాలని సామ రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

FTL  లెవెల్  చూసి నీళ్లు కిందకు వదిలాం : ఏఈ 

చెరువులోకి చేరిన నీటి ఇన్ ఫ్లోతో ఫీట్ లెవెల్ అధికంగా ఉండడంతో 6 గేట్లను ఎత్తి.. దిగువకు నీటిని వదిలామని ఏఈ చెప్పారు. కాలనీల్లో నాళాలు ఓవర్ ఫ్లో అవుతుండడం వల్ల రోడ్లపైకి, ఇండ్లల్లోకి నీరు చేరుతోందని గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి చెప్పడంతో ఒక గేట్ క్లోజ్ చేసి, ఔట్ ఫ్లో తగ్గించామన్నారు. రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నీళ్లు స్టోర్ చేయకుండా దిగువకు వదులుతున్నామని వివరించారు.