తొలి రోజే వింటర్ హీట్

తొలి రోజే వింటర్ హీట్

రాజకీయ వేధింపులపై లోక్​సభలో ప్రతిపక్షాల నిరసన
కాంగ్రెస్ సహా పలు పార్టీల వాకౌట్.. రాజ్యసభలో 250వ సెషన్
ఎన్సీపీ, బీజేడీపై ప్రధాని మోడీ పొగడ్తలు
బీజేపీ సహా అన్ని పార్టీలు వాళ్లను చూసి నేర్చుకోవాలని సూచన

వింటర్​ సెషన్​ తొలిరోజే పార్లమెంట్​ హీటెక్కింది. ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్​ సహా పలు పార్టీల ఎంపీలు సోమవారం లోక్​సభలో నిరసనకు దిగారు. స్పీకర్​ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. వాకౌట్ చేశారు. మరోవైపు రాజ్యసభ 250 సెషన్​ సందర్భంగా ‘‘దేశ రాజకీయాల్లో రాజ్యసభ పాత్ర, సంస్కరణల అవసరం” అన్న అంశంపై చర్చలో ప్రధాని మోడీ, మన్మోహన్ మాట్లాడారు.

న్యూఢిల్లీవింటర్​ సెషన్​ తొలిరోజే ప్రతిపక్షాల నిరసనలతో లోక్​సభ హీటెక్కింది. ప్రతిపక్ష నేతల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, తప్పుడు కేసులు బనాయించి జైళ్లలోకి నెట్టేస్తున్న దని ఆరోపిస్తూ కాంగ్రెస్​ సహా పలు పార్టీల ఎంపీలు స్పీకర్​ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. కొశ్చన్​ అవర్​, జీరో అవర్​ను అడ్డుకున్నారు. సర్కారు తీరును నిరసిస్తూ వాకౌట్ చేశారు. పార్లమెంట్​ సమావేశాలు సోమవారం ఉదయం మొదలయ్యాయి. కొత్తగా ఎన్నికైన నలుగురు ఎంపీలతో ప్రమాణం చేయించి లోక్​సభ స్పీకర్​ ఓంబిర్లా బిజినెస్​ ప్రారంభించారు. ఈమధ్య చనిపోయిన 10 మాజీ ఎంపీలపై సంతాప తీర్మానాలు చేశారు. ఆ వెంటనే స్పీకర్​ క్వొశ్చన్​ అవర్​ చేపట్టగా, కాంగ్రెస్​, డీఎంకే, ఎన్సీ తదితర పార్టీల ఎంపీలు స్పీకర్​ పోడియాన్ని చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

శివసేన కూడా మహారాష్ట్రలో రైతుల దుస్థితిని కేంద్రం పట్టించుకోవడంలేదంటూ నిరసన వ్యక్తం చేసింది. జీరో అవర్​లో కాంగ్రెస్​ లోక్​సభా పక్షనేత అధిర్​ రంజన్​ చౌదరి మాట్లాడుతూ.. కాశ్మీర్​ ఎంపీ ఫరూఖ్​ అబ్దుల్లాను పార్లమెంట్​కు రానీయకుండా నిర్బంధించడం అట్రాసిటీ కిందికి వస్తుందన్నారు.  మాజీ ప్రధాని మన్మోహన్​​, సోనియా ఫ్యామిలీకి ఎస్పీజీ సెక్యూరిటీ ఎత్తివేయడాన్ని నిరసిస్తూ, మాజీ ప్రధాని వాజపేయికి చనిపోయేదాకా ఎస్పీజీ సెక్యూరిటీ కొనసాగించిన విషయాన్ని గుర్తుచేశారు. కేసులు, సెక్యూరిటీ తగ్గింపు అంశాల్లో సర్కారు తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్​ చేశాయి.

ఎన్సీపీ, బీజేడీని చూసి నేర్చుకోవాలి

రాజ్యసభ  250 సెషన్‌‌ సందర్భంగా ‘‘దేశ రాజకీయాల్లో రాజ్యసభ పాత్ర, సంస్కరణల అవసరం”అన్న అంశంపై  సోమవారం  జరిగిన ప్రత్యేక చర్చలో ప్రధాని మాట్లాడుతూ ఎన్సీపీని పొగిడారు. ‘‘ఇవాళ రెండు పార్టీలను(ఎన్సీపీ, బీజేడీ) మెచ్చుకోవాలని అనుకుంటున్నా. పార్లమెంటరీ రూల్స్‌‌కు ఈ రెండుపార్టీలు కట్టుబడి ఉన్నాయి. నిరసనలు తెలపడానికి కోసం వాళ్లెప్పుడూ వెల్‌‌లోకి వెళ్లలేదు. అయినప్పటికీ చెప్పదలచుకున్న పాయింట్స్‌‌ను వాళ్లు ఎఫెక్టివ్‌‌గా చెప్పారు. మాపార్టీతోపాటు అన్ని పార్టీలు వాళ్ల నుంచి నేర్చుకోవాలి’’ అని ప్రధాని అన్నారు. “ఇది శాశ్వతమైందని చెప్పగలను.  దేశ ఫెడరల్ ​స్ట్రక్చర్​కు ఈ సభ ప్రాధాన్యం ఇస్తుంది”అని రాజ్యసభ గురించి ప్రధాని చెప్పారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ మాట్లాడుతూ… రాష్ట్రాల సరిహద్దుల్ని మార్పులు, చేర్పులు చేసేటప్పుడు రాజ్యసభకు మరింత ఎక్కువ
ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.