అసోం ప్రభుత్వం ముస్లింల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోంది : అసదుద్దీన్ ఒవైసీ

అసోం  ప్రభుత్వం ముస్లింల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోంది : అసదుద్దీన్ ఒవైసీ

బాల్య వివాహాలకు పాల్పడిన వారిని  ఆరెస్డ్ చేస్తోన్న అసోం ప్రభుత్వంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైరయ్యారు.  అసోం  ప్రభుత్వం ముస్లింల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పుడు మగవాళ్లను అరెస్ట్ చేస్తున్నారు, ఆరెస్టైన వారి భార్యల బాగోగులు ఎవరు చూస్తారు.. సీఎం చూసుకుంటారా? అని ప్రశ్నించారు. గత ఏడేళ్లలో అసోంలో బాల్య వివాహాలను బీజేపీ అరికట్టలేకపోయిందని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ఒవైసీ అన్నారు. ఎగువ అస్సాంలోని ప్రజలకు  హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం భూములు ఇచ్చిందని, దిగువ అస్సాంలో ఇలా ఎందుకు చేయడం లేదని ఒవైసీ ప్రశ్నించారు.  

బాల్య వివాహాలను అరికట్టడంపై అసోం ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,170 మందిని అరెస్టు చేయగా, 4,074 బాల్య వివాహాల కేసులు నమోదయ్యాయి. అరెస్టయిన వారిలో 52 మంది పూజారులు ఉన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిని అస్సలు వదిలిపెట్టకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అస్సాం పోలీసులను ఆదేశించినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు.

15 రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 4,000కుపైగా కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సీఎం  చెప్పారు. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకునేవారిపై, పోక్సో చట్టం కింద అభియోగాలు మోపాలని అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. ఇలాంటి విషయాల్లో వివాహానికి మద్దతు తెలిపే మతపెద్దలు, పురోహితులు తదితరులపైనా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.