ఆశా వర్కర్లకు హామీలిచ్చి మర్చిపోయిన సీఎం

 ఆశా వర్కర్లకు హామీలిచ్చి మర్చిపోయిన సీఎం

మంచిర్యాల/మహబూబ్​నగర్, వెలుగు: వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో అనేక పనులు చేస్తున్న తమను సర్కారు చిన్నచూపు చూస్తోందని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్​ఐదేండ్ల కిందట ప్రగతిభవన్​వేదికగా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, ఇంకా ఎన్నాళ్లు వెట్టిచాకిరీ చేయాలని వాపోతున్నారు. గర్భిణుల నమోదు, హాస్పిటళ్లలో డెలివరీలు, పిల్లలకు టీకాలు, టీబీ పరీక్షలు, లెప్రసీ సర్వేలు అంటూ 30కి పైగా పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం పనికి తగిన పారితోషికం ఇవ్వకుండా తమ జీవితాలతో ఆడుకుంటోందని మండిపడుతున్నారు. ఫిక్స్ డ్​శాలరీ, అదనపు పనికి అదనపు పారితోషికం, జాబ్​చార్ట్​ అమలు, ఆరోగ్యభద్రత తదితర సమస్యల పరిష్కారం కోసం ఏండ్లుగా పోరాడుతున్న ఆశా వర్కర్లు వారం రోజులుగా ఆందోళనబాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు, వంటావార్పులు చేస్తున్నా సర్కారు నుంచి స్పందన కరవైంది.  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాతా శిశు మరణాలను తగ్గించాలనే లక్ష్యంతో హాస్పిటళ్లలో డెలివరీలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం 2006లో ఆశా కార్యకర్తల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒకరిని నియమించింది. వీరికి ‘పనిని బట్టి వేతనం’ ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 చొప్పున ఇన్సెంటివ్​ చెల్లిస్తున్నాయి. మొదట్లో ఆశాలను పార్ట్​టైమ్​వర్కర్లుగా వాడుకున్న ప్రభుత్వాలు క్రమంగా వారి సేవలను విస్తరించాయి. వాడవాడలా తిరిగి గర్భిణుల వివరాలను నమోదు చేసుకోవడం, నెలనెలా హాస్పిటల్​కు తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించడం, గవర్నమెంట్​హాస్పిటళ్లలో డెలివరీలు చేయించడం ఆశాల డ్యూటీ కాగా వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో అన్ని పనులూ వాళ్లకే చెప్తున్నారు. ప్రభుత్వం ఏ కొత్త పథకాన్ని ప్రారంభించినా ఆ పనిని ఆశాలకే అప్పగిస్తోంది. కంటివెలుగు క్యాంప్​లకు ప్రజలను తీసుకురావడం, టోకెన్లు ఇవ్వడం వంటి పనులు చేయించుకొని పైసా ఇవ్వలేదు. మళ్లీ జనవరి 18 నుంచి నిర్వహించే కంటివెలుగులో ఆశాల సేవలను వాడుకోనున్నారు. టీబీ నివారణలో భాగంగా ప్రతి కార్యకర్త నెలకు 10 మంది నుంచి తెమడ శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపించాలి. ఇటీవల పైలేరియా సర్వే, లెప్రసీ సర్వే పనులు చెప్పి అందుకు పారితోషికం ఇవ్వలేదు. అలాగే ఎలక్షన్లలో పోలింగ్​ కేంద్రాల దగ్గర, ఎగ్జామ్​ సెంటర్ల దగ్గర వీరి సేవలను వినియోగించుకుంటున్నారు. కొవిడ్​ సమయంలో ఇల్లిల్లూ తిరిగి సర్వేలు చేసినందుకు ఇంతవరకు ఇన్సెంటివ్​ చెల్లించలేదు. దీనికితోడు ఆశాలు 32 రకాల రిజిస్టర్లు నిర్వహించడం తలకు మించిన భారంగా మారింది. ఇంత చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత లేకపోగా విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన వాళ్ల కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవడం లేదని వాపోతున్నారు.  

ఐదేండ్లు దాటినా అమలు కాలే..

సీఎం కేసీఆర్​2017 మే 5 ప్రగతిభవన్​లో ఆశా వర్కర్లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వాలు ఆశాలతో వెట్టిచాకిరీ చేయించుకున్నాయని అన్నారు. వాళ్లకు నెలకు రూ.2 వేల జీతమే వస్తోందని, తాము ఫిక్స్​డ్​శాలరీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ఆరోగ్య కార్యకర్త హోదా కల్పిస్తామని, ఏఎన్ఎంల నియామకంలో వెయిటేజీ ఇస్తామని, అంగన్​వాడీ స్థాయికి తీసుకొస్తామని అన్నారు. మరోసారి జీతం పెంచుతామని, అందులో రూపాయి కూడా కట్​ కాకుండా చూస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 24 వేల మందిని రెగ్యులరైజ్​ చేస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికి ఐదు సంవత్సరాలు దాటినా కేసీఆర్​ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా పనిభారం, జీతాల్లో కోతలతో అవస్థలు పడుతున్నామని ఆశా వర్కర్లు వాపోతున్నారు. 

కనీస వేతనం చెల్లించాలి

మాతా శిశువులకు సేవలందించేందుకు నియమించిన మాతో ప్రభుత్వం అనేక పనులు చేయించుకుంటోంది. కానీ అదనపు పనికి అదనపు పారితోషికం ఇవ్వడం లేదు. ఏడాది కింద ప్రభుత్వం ప్రకటించిన రూ.9,750 ఫిక్స్​డ్​ శాలరీ ఏరియర్స్​తో కలిపి చెల్లించాలి. ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం నెలకు రూ.26వేలు చెల్లించాలి. – సమ్మక్క, ఆశా వర్కర్ల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు  

పెండింగ్​ పారితోషికాలు రిలీజ్​ చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సర్వేను మాతో చేయిస్తోంది. కానీ పారితోషికం ఇవ్వడం లేదు. ఏ సర్వేకు ఎంత ఇస్తుందనేది కూడా చెప్పడం లేదు. కంటి వెలుగు, లెప్రసీ, ఇతర సర్వేలకు సంబంధించిన బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. జనవరిలో మళ్లీ కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని మమ్మల్నే చేయమని అంటున్నారు. అందుకే శుక్ర, శనివారాల్లో కలెక్టరేట్​ వద్ద ధర్నాలు చేశాం. మంత్రిని కలిసి, మా సమస్యలను వివరిస్తాం. ఆ తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం. – పల్లె సావిత్రి, ఆశ వర్కర్​, పీహెచ్​సీ రాజాపూర్, మహబూబ్​నగర్

ఆశాల డిమాండ్లు ఇవీ..

డిసెంబర్​ 6 నుంచి నిర్వహిస్తున్న లెప్రసీ సర్వేకు, జనవరి 18 నుంచి నిర్వహించే కంటి వెలుగు సేవలకు అదనంగా పారితోషికం ఇవ్వాలి.  గతంలో నిర్వహించిన లెప్రసీ, కంటివెలుగు పెండింగ్​ డబ్బులు చెల్లించాలి. టీబీ తెమడ డబ్బాలను మోపించడం రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం చెల్లించిన కరోనా రిస్క్​ అలవెన్స్​నెలకు రూ.వెయ్యి చొప్పున 16 నెలల బకాయిలు విడుదల చేయాలి. జాబ్​చార్ట్​ అమలు చేయాలి. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి. అప్పటివరకు ఏపీలో ఇస్తున్నట్టుగా రూ.10వేల ఫిక్స్​డ్​శాలరీ ఇవ్వాలి. 2021 జూలై నుంచి డిసెంబర్​వరకు ఆరు నెలల పీఆర్సీ ఏరియర్స్​ చెల్లించాలి. 32 రకాల రిజిస్టర్లను ప్రభుత్వమే ప్రింట్​ చేయాలి. ఈలోపు రిజిస్టర్ల కోసం పెట్టిన ఖర్చులను చెల్లించాలి. క్వాలిటీతో కూడిన ఐదు సంవత్సరాల పెండింగ్​యూనిఫామ్స్​ఇవ్వాలి. జిల్లా హాస్పిటళ్లలో రెస్ట్​రూంలు ఏర్పాటు చేయాలి. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఈ లోపు అక్కడ పనిచేసే ఇన్​చార్జిలకు అలవెన్స్​ ఇవ్వాలి. పీఎఫ్, ఈఎస్​ఐ సౌకర్యం, ఉద్యోగభద్రత కల్పించాలి.