ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌‌

ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌‌

హైదరాబాద్/వికారాబాద్/శామీర్‌‌‌‌పేట, వెలుగు: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ పలు జిల్లాల్లో ఆశా వర్కర్లు కలెక్టరేట్లను ముట్టడించారు. సర్వేల పేరుతో ఆశా వర్కర్లతో చాకిరి చేయించుకొని తగిన జీతాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐటీయూ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌‌, వికారాబాద్‌‌, మేడ్చల్‌‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేశారు. తర్వాత ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. తమకు పారితోషికాలు కాకుండా ఫిక్స్‌‌డ్‌‌ శాలరీలు ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు. సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి వెంకటేశ్‌‌ మాట్లాడుతూ, ఆశా వర్కర్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లెప్రసీ సర్వేకి అదనంగా డబ్బులు చెల్లించాలని కోరారు. కంటి వెలుగు పనికి కూడా అదనంగా ఇవ్వాలన్నారు. గతంలో నిర్వహించిన లెప్రసీ సర్వే, కంటి వెలుగు పెండింగ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్‌‌ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఏపీలో ఇస్తున్నట్లు ఫిక్స్‌‌డ్ వేతనం రూ.10 వేలు అందించాలని సౌత్ కమిటీ అధ్యక్షురాలు మీనా కోరారు.

గతేడాది డిసెంబర్ వరకు 6 నెలల పీఆర్సీ ఎరియర్స్ చెల్లించాలన్నారు. వికారాబాద్ కలెక్టర్ ముందు ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంగమ్మ, సీఐటీయూ జిల్లా అద్యక్షుడు మహిపాల్, జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌‌ చేశారు. అధికారుల వేధింపులు ఆపాలని, పించన్ సౌకర్యంతోపాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. సీఐటీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ.. ఏపీలో ఆశా వర్కర్లకు రూ.10 వేలు ఫిక్స్‌‌డ్ శాలరీ ఇస్తున్నా, ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో చెల్లించడం లేదన్నారు. ఆశాలను కార్మికులుగా గుర్తించి, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేసి, పీఆర్సీ బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.