ఆషాడమాసం వచ్చేసింది. ఈ మాసం రాగానే.. మొదటగా గుర్తొచ్చేది బోనాల సందడి. ఆడపడుచులంతా.. బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. డప్పు దరువుల మధ్య పోతరాజుల నృత్యాలు, పూనకంతో ఊగిపోయే భక్తులతో అమ్మవారి ఆలయాలన్నీ సందడి సందడిగా మారబోతున్నాయి. మొదట గోల్కొండలో బోనాలు ప్రారంభమౌతాయనే సంగతి తెలిసిందే. అనంతరం సికింద్రబాద్ మహంకాళి బోనాలు జరుగుతాయి. ఇతర ప్రాంతాల్లో జరిగే బోనాలతో సందడి ముగియనుంది. ఇక ఈ నెల 30వ తేదీ నుంచి గోల్కొండలో బోనాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు ప్రభుత్వం, ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి జూలై 28 వరకు కోటలో బోనాలు కొనసాగనున్నాయి. గురువారం ఉదయం 11:30కి లంగర్ హౌజ్ లో మంత్రులు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 12 గంటలకు బడా బజార్ నుంచి అమ్మవారి విగ్రహాల ఊరేగింపు మొదలు కానుంది.
కరోనా కారణంగా బోనాల్లో భక్తులను అనుమతించలేదు. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతి తక్కువగా ఉండడంతో బోనాల జాతరకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. నియమ, నిబంధనల మధ్య బోనాలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. గోల్కొండ ఖిల్లాలో ఉన్న జగదాంబికా అమ్మవారికి తరతరాలుగా కుమ్మరి వంశస్తులైన ఆడవారు తాము తయారు చేసిన మట్టి కుండలో బోనాన్ని వండుతారు. మగవారు వెదురుతో తయారు చేసిన తొట్టెలకు రంగురంగుల కాగితాలు అతికిస్తారు. లంగర్ హౌస్ ప్రాంతం నుంచి ఊరేగింపుగా వచ్చి బోనాన్ని తీసుకుని గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారికి మొట్టమొదట సమర్పిస్తారు. దీంతో తెలంగాణ అంతటా బోనాల జాతర మొదలవుతుంది. తరువాత ఆ కుమ్మరి వంశస్తులు భక్తులకు బొట్టు పెడుతూ అర్చనలు చేస్తూ అక్కడే పూజారులుగా ఉంటారు. బోనం సమర్పించాక వారికి కట్నకానుకలు అందించి ఆశీర్వాదం తీసుకుంటే తమ కుటుంబానికి బర్కత్ అని ప్రజలు నమ్ముతారు.
- జూలై 17న ఉజ్జయిని మహంకాళి బోనాలు
- జూలై 18న రంగం, భవిష్యవాణి.
- జూలై 24న భాగ్యనగరంలో బోనాలు.
- జూలై 25న దేవాలయాల ఘట్టాల ఊరేగింపు.
