ఇయ్యాల్టి నుంచి బోనాలు..హైదరాబాద్​లో నెల రోజుల పాటు వేడుకలు

ఇయ్యాల్టి నుంచి  బోనాలు..హైదరాబాద్​లో నెల రోజుల పాటు వేడుకలు
  • గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో షురూ 
  • జులై 9న సికింద్రాబాద్​లో, 16న లాల్ దర్వాజాలో..

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో ఆషాఢమాస బోనాలు గురువారం ప్రారంభం కానున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో ఉత్సవాలు మొదలవుతాయి. లంగర్ హౌస్ నుంచి నిర్వహించనున్న గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మొత్తం నెల రోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలతో నగరమంతా సందడి నెలకొంటుంది. 

గోల్కొండలో ప్రతి ఆదివారం, గురువారం బోనాలు సమర్పిస్తారు. చివరగా వచ్చే నెల 20న అమ్మవారికి 9వ బోనం సమర్పించడంతో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశామని గోల్కొండ ఆలయ కమిటీ చైర్మన్ ఆరేళ్ల జగదీశ్ యాదవ్ తెలిపారు. కాగా, ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా జులై 9న  సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 10న రంగం ఉంటుంది. జులై 16న లాల్ దర్వాజా బోనాలు, 17న రంగం కార్యక్రమంతో పాటు ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు ఉంటుంది.