కొత్త సీఎం ఎంపికపై హైడ్రామా

కొత్త సీఎం ఎంపికపై హైడ్రామా

రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం కంటిన్యూ అవుతోంది. ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ AICC అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండడంతో.... ఆయన సీఎం స్థానంలో కొత్త సీఎం ఎంపికపై హైడ్రామా కంటిన్యూ అవుతోంది. ఓవైపు సీఎంగా తానే కొనసాగుతానని గెహ్లాట్ పట్టుబట్టడం సంక్షోభానికి అసలు కారణం. యువనేత , డిప్యూటీ సీఎంగా ఉన్న సచిన్ పైలట్ కు సీఎం పగ్గాలు అప్పగించేందుకు అశోక్ గెహ్లాట్ ఒప్పుకోవడం లేదు. దీనికి ఆయన మద్దతుదారులను తెరపైకి తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో గెహ్లాటే తమ సీఎంగా ఉండాలని వారు తేల్చిచెప్తున్నారు. ఒకవేళ సీఎంను మార్చాల్సి వస్తే.... సచిన్ ఫైలట్ కాకుండా తమ వర్గానికి చెందిన వ్యక్తికే పదవి ఇవ్వాలని హైకమాండ్ దూతలకు చెప్తున్నారు. 
 
హైకమాండ్ ఒత్తిడి తీసుకువచ్చేందుకు గెహ్లాట్ కు  మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేసేందుకు 92 మంది ఎమ్మెల్యేలు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలూ ఉన్నారు. వీరంతా ఆదివారం అసెంబ్లీ స్పీకర్  సీపీ జోషి ఇంటికి వెళ్లారు. ఐతే రాజీనామా లేఖలను ఇచ్చారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు అశోక్ గెహ్లాట్ AICC అధ్యక్ష పదవికి పోటీ చేస్తే... రాజస్థాన్ లో ఏం చేయాలనే దానిపై మాట్లాడేందుకు ఢిల్లీ పార్టీ పెద్దలు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. హైకమాండ్ పరిశీలకులుగా జైపూర్ వచ్చిన సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, అజయ్ మాకన్ లో సీఎల్పీ మీటింగ్ కు అటెండయ్యారు. ఐతే గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ మీటింగ్ కు అటెండ్ కాలేదు. చివరకు మీటింగ్ జరగకుండానే వాయిదా పడింది. తమతో విడివిడిగా నైనా వచ్చి మాట్లాడాలని ఎమ్మెల్యేలను హస్తిన పెద్దలు పిలిచారు. ముఖ్యమంత్రి గెహ్లాట్ ఇంట్లోనే సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. మామూలుగా ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమనే ఏకవాక్య తీర్మానాన్ని చేస్తుంటారు. దానికి భిన్నంగా సీఎల్పీ భేటీకి ముందే మంత్రి శాంతి ధారీవాల్  నివాసంలో గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అశోక్ గెహ్లాట్ నే సీఎంగా ఉంచాలనీ, లేదంటే 2020 లో సచిన్  పైలట్  తిరుగుబాటు చేసినప్పుడు సర్కారుకు అండగా ఉన్నవారిలో ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయాలని వీరంతా నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
తాజా రాజకీయ పరిస్థితుల్లో అశోక్ గెహ్లాట్ , సచిన్ పైలట్  లను ఢిల్లీ రావాలని అధిష్ఠానం ఆదేశించినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ లో సీఎల్పీ సమావేశానికి గెహ్లాట్ వర్గం రాకపోవడంతో పార్టీ చీఫ్ సోనియా సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. దీనిపై పార్టీ పెద్దలు గెహ్లాట్ తో మాట్లాడారు. ఐతే ఎమ్మెల్యేలంతా సీరియస్ గా ఉన్నారని... ఈ సిచ్చువేషన్ లో తానేమీ చేయలేనని గెహ్లాట్ చెప్పినట్టు తెలుస్తోంది. ఒక వ్యక్తికి ఒకే పదవి అంశంపై హైకమాండ్ పునరాలోచన చేయాలని గెహ్లాట్ వర్గం డిమాండ్ చేస్తోంది. రెండు పదువులను నిర్వహించే సామర్థ్యం అశోక్ గెహ్లాట్ కు ఉందని అంటున్నారు. మరోవైపు స్పీకర్ సీపీ జోషితో ఎమ్మెల్యేల సమావేశం అర్ధరాత్రి వరకు కొనసాగింది. తర్వత AICC పరిశీలకులు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ పార్టీ ఇంచార్జ్ అజయ్ మాకెన్ తో నేతలు సమావేశమయ్యారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని హైకమాండ్ రాజస్థాన్ నేతలకు సూచించింది.