
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఆ పార్టీ నేత, సీఎం అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కడా అధికారంలోకి రాదన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఎగ్జిట్ పోల్స్, సర్వేలు ఏదో చెప్పొచ్చు. కానీ ప్రజల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ప్రకారం రాష్ట్రంలో మా ప్రభుత్వమే మళ్లీ వస్తుందని తేలిపోయింది” అని ఆయన చెప్పారు.
దేశంలో ఒక్క రాజస్థాన్ లో మాత్రమే ప్రభుత్వ వ్యతిరేకత ఏమాత్రం లేదన్నారు. అభివృద్ధి పనుల్లో ఏ ఒక్కటీ తాము వదిలిపెట్టలేదని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. తన ప్రభుత్వాన్ని కూలదోయలేమన్న ఆక్రోశంతోనే ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెదిరింపు ధోరణిలో మాట్లాడారని ఆరోపించారు.