పరిష్కారం చూపకుండా డెడ్​లైన్​ ఏంది?: అశ్వత్థామరెడ్డి

పరిష్కారం చూపకుండా డెడ్​లైన్​ ఏంది?: అశ్వత్థామరెడ్డి

జాబ్స్​ తీసేసే అధికారం ఎవరికీ లేదు.. కోర్టునూ డిక్టేట్​ చేస్తున్న సీఎం

బేషరతు అన్నరు.. రేపు జీతాలివ్వకపోతే ఎట్ల?

సగం ప్రైవేటుకిస్తే 27 వేల మందే అవసరం

మరి మిగతా 23 వేల కార్మికుల పరిస్థితేంది?

పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం: ఆర్టీసీ జేఏసీ చైర్మన్​

కోర్టు పరీక్షల నేపథ్యంలో 5 నాటి ‘సడక్ బంద్​’ వాయిదా​

ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు తీసేసే అధికారం ఎవ్వరికీ లేదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్​ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. చర్చల ద్వారా పరిష్కారం చేయకుండా డెడ్​లైన్​ విధించడమేమిటని సీఎం కేసీఆర్​ను ప్రశ్నించారు. ఇలా డెడ్​లైన్​ విధించడం ఇది నాలుగోసారి అని, మూడు సార్లు డెడ్​లైన్​ విధించినప్పుడు కార్మికులు జాయిన్​ కాలేదని, ఇప్పుడు కూడా జాయిన్​ కారని ఆయన తెలిపారు. డ్యూటీల్లో జాయిన్​ అయ్యి ఆత్మద్రోహం చేసుకోవద్దని, పోరాటంలో భాగస్వాములు కావాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. హైదరాబాద్​లోని టీఎంయూ ఆఫీసులో ఆదివారం ఆర్టీసీ జేఏసీ సమావేశం జరిగింది. శనివారం సాయంత్రం సీఎం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో జేఏసీ నేతలు చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్​ ప్రేరేపిత నిర్ణయాలే కారణమన్నారు. ఆర్టీసీ అమరవీరుల కుటుంబాల గురించి సీఎం ఆలోచించాలని డిమాండ్​ చేశారు. చర్చలకు పిలిచి ఏం చేస్తారో చెప్పకుండా డ్యూటీలో చేరాలంటూ డెడ్​లైన్​ విధించడం సరికాదన్నారు. కేసీఆర్​ వ్యాఖ్యల వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతాయని చెప్పారు. కార్మికుల డిమాండ్లపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తదో.. ఏం చేయదో చెప్పాల్సిన అవసరం సీఎంకు ఉందన్నారు. మంత్రి మండలి కమిటీని గానీ, ఆర్టీసీ యాజమాన్య కమిటీని గానీ నియమించకుండా కోర్టును కూడా డిక్టేట్​ చేసేలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల తరఫున అడ్వకేట్​ కోర్టుకు ఇచ్చిన రిపోర్ట్ ను కూడా తప్పు అనడం ఏమిటని ప్రశ్నించారు. కార్మికుల తరఫు అడ్వకేట్​ నీతి, నిజాయితీ కల్గిన వ్యక్తి అని చెప్పారు. కార్మికుల జీతాలేందో, ఆర్టీసీకి రావాల్సిన డబ్బులేందో భవిష్యత్తులో ఏ విధంగా చెల్లిస్తరో కేసీఆర్​ చెప్పాలన్నారు.

అట్లయితే 23 వేల మంది పరిస్థితి ఏంది?

5100 రూట్లను ప్రైవేటుకిస్తే ప్రస్తుతం ఉన్న 50 వేల కార్మికుల్లో  27 వేల మంది మాత్రమే సరిపోతారని, మరి మిగతా 23 వేల కార్మికుల సంగతేందని అశ్వత్థామరెడ్డి ప్రశ్నించారు. ఈ 23 వేల మంది కార్మికుల గురించి కేసీఆర్​ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ప్రైవేటుకిస్తే 97 డిపోలకు గానూ 45 డిపోలు ప్రైవేటు పరం అవుతాయని, డీఎంలు, డీవీఎంల పోస్టులు కూడా తగ్గిపోతాయన్నారు. డీఎంలు, డీవీఎంలు కూడా ఈ విషయాన్ని గమనించి బయటకు వచ్చి తమతో కలిసి పోరాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్​ ప్రకారం పోస్టులు వచ్చేవని, ఇప్పుడు ప్రైవేటుకిస్తే ఏవిధంగా రిజర్వేషన్లు పాటిస్తారోనని అనుమానం వ్యక్తం చేశారు.

కేసీఆర్​ మైండ్​లో 100%  ప్రైవేట్​ ఉంది: రాజిరెడ్డి

50 శాతం ప్రైవేటుకు ఇస్తామని కేసీఆర్​ చెబుతున్నప్పటికీ ఆయన మైండ్​లో  మాత్రం100 శాతం ప్రైవేట్​ చేయాలనే అనుకుంటున్నారని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్​ రాజిరెడ్డి విమర్శించారు. కేసీఆర్​ పాత ధోరణితోనే మాట్లాడారని, చర్చల ద్వారా పరిష్కారం చేయకుండా ప్రైవేటు చేస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. సమ్మెను యథావిధిగా కొనసాగించాలని కార్మికులే తమను పట్టుబడుతున్నారని, సమ్మె కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులను పిల్లలుగా మనస్ఫూర్తిగా కేసీఆర్​ భావిస్తే చర్చలకు పిలిచి ఏం కావాలో అడిగి, ఏం ఇస్తరో ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

బేషరతు అన్నరు.. జీతాలివ్వకపోతే  ఎట్ల?

డిమాండ్లపై చర్చించకుండా బేషరతుగా డ్యూటీలో జాయిన్​ అవ్వాలని చెప్పడమేమిటని అశ్వత్థామరెడ్డి ప్రశ్నించారు. ఒకవేళ బేషరతుగా జాయిన్​ అయితే భవిష్యత్తులో కార్మికుల జీతాలు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. ‘బేషరతుగా జాయిన్​ అయ్యారు మీకు జీతాలెక్కడివి?’ అని అంటే ఏం చేయగలమన్నారు. కార్మికుల్లో విశ్వాసాన్ని కల్గించకుండా జాయిన్​ అవ్వాలంటే ఎలా అని ప్రశ్నించారు. చర్చల ప్రక్రియను వెంటనే ప్రారంభించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. అన్నింటిని వెంటనే పరిష్కారం చేయాలని తాము అనడం లేదని, ఒక పద్ధతి ప్రకారం చర్చల ప్రక్రియను చేపట్టాలని అడుగుతున్నామని తెలిపారు. ఈ నెల 5న కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఉన్నందున ఆ రోజు నిర్వహించాల్సిన ‘సడక్​ బంద్’​ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని, దాన్ని ఏ రోజు నిర్వహించేదీ త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

‘కార్మికుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్​ ప్రేరేపిత నిర్ణయాలే కారణం. ఆర్టీసీ అమరుల కుటుంబాల గురించి సీఎం ఆలోచించాలి. చర్చలకు పిలిచి ఏం చేస్తారో చెప్పకుండా డ్యూటీలో చేరాలంటూ డెడ్​లైన్​ విధించడం సరికాదు. కేసీఆర్​ వ్యాఖ్యల వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అన్ని వెంటనే పరిష్కరించాలనడం లేదు.. ఒక పద్ధతి ప్రకారం చర్చల ప్రక్రియ చేపట్టాలని అడుగుతున్నం’

‑ అశ్వత్థామరెడ్డి